ఆశ్చర్యం: ఆవు పేడ దొంగిలించి.. కటకటాలపాలైన ప్రభుత్వోద్యోగి!

2:40 pm, Thu, 7 February 19
cow-dung-govt-employee

cow dung

బెంగళూరు: సాధారణంగా విలువైన వస్తువులు, బంగారు, వెండి ఆభరణాలు, నగదు దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదులు వస్తుంటాయి. కానీ, ఆశ్చర్యకరంగా ఆవు పేడ దొంగతనం జరిగిందంటూ ఓ ఫిర్యాదు అందింది. దీంతో విచారణ జరిపిన పోలీసులు.. ఆవు పేడను దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కమాళలూరు జిల్లా బీరూర్ పట్టణంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సుమారు 30-40 ట్రక్కుల పేడను సేకరించింది. దాని విలువ రూ. 1.25 లక్షలు. అయితే తమ వద్ద నిల్వ ఉంచిన పేడ రాత్రికి రాత్రే మాయమైంది. లక్షల విలువ పేడ కావడంతో ఈ చోరీ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పశుసంవర్దక శాఖ డైరెక్టర్‌.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అమ్మేసేందుకే ఈ దొంగతనం చేశా: నిందితుడు

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. కాగా, పశుసంవర్థక శాఖలోనే సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న ఉద్యోగే ఈ చోరీకి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలింది. అతడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా.. దొంగలించిన పేడను ఓ ప్రైవేట్‌ స్థలంలో దాచినట్టు చెప్పాడు. ఆ పేడను కాజేసీ రైతులకు అమ్మాలని భావించానని చెప్పాడు.

ప్రస్తుతం నిందితుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు. ఈ వార్త వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ఆవు పేడకు కూడా భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అయితే, మనదేశంలో ఆవు పేడను సేంద్రియ ఎరువుగా, వంటచెరుకుగాను, ఇతర అవసరాలకు కూడా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.