పూరీ తీరంలో ‘ఫణి’ ప్రభంజనం.. గాల్లోకి ఎగిరిన ఎయిమ్స్ పైకప్పు..

9:56 pm, Fri, 3 May 19

ఒడిశా: గత కొద్ది రోజులుగా పుంజుకున్న ‘ఫణి’ తుఫాను శనివారం ఒరిస్సాలోని పూరీ తీరాన్ని తాకడంతో అక్కడ పరిస్థితి క్షణక్షణానికి దారుణంగా మారుతోంది.

విపరీతమైన గాలులు, భారీ వర్షం రావడంతో ఎన్నో ఏళ్ల నాటి చెట్లు సైతం పేక మేడలా కుప్పకూలి పోతున్నాయి.  ఇంటి పైకప్పులు ఎగరడం, కరెంట్ స్థంభాలు కూలడం, రహదారుల్లో నీళ్ళు నిలిచి పోవడం ఇలా రకరకాల భీభత్సాలు సృష్టిస్తూ ‘ఫణి’ తుఫాను ప్రజల్ని ఒణికిస్తోంది.

చదవండి: ఒడిశాలోని పూరీ దగ్గర తీరం తాకిన ‘ఫొని’ తుపాను.. శ్రీకాకుళానికి తప్పిన ముప్పు

నెటిజన్లు ఎప్పటికప్పుడు తుపానుకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో అవి వైరల్ అవుతున్నాయి.

ఉత్తరాంధ్రకి సైతం భారీ నష్టం?

ఇక తుపాను గాలుల దెబ్బకు భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిపై ఉన్న రూఫ్ గాలిలోకి ఎగిరిపోయింది. దీనిపై ఎయిమ్స్ యజమాన్యం మాటాడుతూ తుఫాను వస్తుందని ముందుగానే అవసరమైన సామగ్రి సమకూర్చుకున్నామని, ఇతరులకు సాయం చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

చదవండి: ఉత్తరాంధ్రకు సమీపంలో ఫోని! శ్రీకాకుళం జిల్లాకి పొంచి ఉన్న పెనుముప్పు!

‘ఫణి’ ఒరిస్సాని గడగడలాడించడంతో పాటు ఉత్తరాంధ్రకి సైతం భారీ నష్టాన్ని చేకూర్చేలా ఉందని వాతావరణ శాఖాధికారులు తెలుపుతున్నారు. దీనితో విశాఖ, విజయనగరం, తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో ఎలెక్షన్ కోడ్‌ని ఎత్తివేసినట్టు ఈసీ ప్రకటించింది.

ఈ 5 జిల్లాలలోని అధికారులను అప్రమత్తం చేస్తూ ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  అధికారులతో సమావేశమయ్యారు. ఏ ప్రళయం సంభవించినా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులని ఆదేశించారు.

చదవండి: బంగాళాఖాతంలో అల్లకల్లోలం.. మంగినపూడి బీచ్‌లో ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలలు..