న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లోని లఢఖ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చించేందుకు కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఉదయం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్‌తోపాటు త్రివిధ దళాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైనాతో భూసరిహద్దుతోపాటు గగనతలం, సముద్రతలంలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఉంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా బలగాలు దూకుడుగా వ్యవహరిస్తే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి రక్షణమంత్రి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు సమాచారం.
భారత్-చైనా సరిహద్దుల్లో చైనా దురాక్రమణకు ప్రయత్నించడంతో జూన్ 15, 16 తేదీల్లో గల్వాన్ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.