సరిహద్దు ప్రాంతాల్లో సైన్యం ఏ స్థాయిలో అప్రమత్తంగా ఉంది..? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి..? అనే విషయాలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేడు సమీక్ష నిర్వహించారు.
తూర్పు లడఖ్ సహా ఇతర సరిహద్దు ప్రాంతాల్లో మొత్తంగా భారత సైన్యం సన్నద్ధతపై ఈ రోజు ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్టు సమాచారం.
సిక్కింలోని వాస్తవాధీన రేఖ, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాలు కూడా సమీక్ష జరిపిన వాటిలో ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
చైనా, భారత సైన్యాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న ‘ప్రతిష్టంభన’పై ఇరు దేశాల మధ్య మరోసారి మేజర్ జనరల్ స్థాయి చర్చలు జరిగినప్పటికీ.. ఈ సమీక్ష జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తూర్పు లడఖ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై రక్షణ మంత్రికి ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే పూర్తి వివరాలు సమర్పించినట్టు తెలుస్తోంది.
ఈ సమావేశంలో భద్రతా దళాల చీఫ్ జనరల్ బిపిన్ రావత్, నేవీ చీఫ్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్, వాయుసేన చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా తదితరులు పాల్గొన్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.