సీఏఏ ఇష్యూ: ఢిల్లీలో హింస.. 20 మంది మృతి, సైన్యాన్ని దింపాలని సీఎం కేజ్రీవాల్ డిమాండ్…

11:43 am, Wed, 26 February 20

న్యూఢిల్లీ: పౌరసత్వ వ్యతిరేక చట్టానికి అనుకూలంగా, వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతోంది. ఆదివారం మొదలైన అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ అల్లర్ల కారణంగా ఇప్పటి వరకు 20 మంది మరణించగా, 150 మంది వరకు గాయపడ్డారు. 

సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల నడుమ చెలరేగిన ఘర్షణ.. హింసకు, దాడులకు దారితీసింది. హింసాత్మక ప్రాంతాల్లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నాయి. పోలీసులు, పారా మిలిటరీ బలగాలు రంగంలోకి దిగినా పరిస్థితి అదుపులోనికి రావడం లేదు. ఈ నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీ వార్ జోన్‌ను తలపిస్తోంది.  సీబీఎస్ఈ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. 

కాల్పుల ఘటన సోషల్ మీడియాలో వైరల్…

మరోవైపు, గుంపు నుంచి అకస్మాత్తుగా దూసుకొచ్చిన ఓ యువకుడు మరో గ్రూపుపై కాల్పులు జరపడంతో ఆందోళనలు కాస్తా హింసాత్మకంగా మారాయి.  జఫ్రాబాద్‌లో ఆందోళనకారుల మధ్య నుంచి వచ్చిన ఓ వ్యక్తి కాల్పులు జరపడాన్ని చూసినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులుపైనా అతడు తుపాకి గురిపెట్టినట్టు చెప్పారు.

మరోవైపు ఈ కాల్పులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ఈ ఘటనకు పాల్పడిన షారూఖ్ (33) అనే నిందితుడ్ని తమ అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు.

సైన్యాన్ని దించండి: సీఎం కేజ్రీవాల్

సీఏఏ అనుకూల, ప్రతికూల వర్గాల నడుమ ఘర్షణ కారణంగా చెలరేగిన హింసను పోలీసులు అదుపు చేయలేకపోతున్నారని, వెంటనే సైన్యాన్ని రంగంలోకి దించి పరిస్థితిని అదుపులోనికి తీసుకురావాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

రాత్రంతా తాను పోలీసు అధికారులతో మాట్లాడుతూనే ఉన్నానని, పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, పోలీసులు ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోనికి రావడం లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

సైన్యాన్ని దించి, కర్ఫ్యూ విధించాల్సిన అవసరం కనిపిస్తోందని, ఈ విషయమై తాను హోం మంత్రి అమిత్ షాకు లేఖ కూడా రాయనున్నట్లు ఆయన వివరించారు. 

హింసాత్మక ప్రాంతాల్లో అజిత్ దోవల్ పర్యటన…

మరోవైపు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మంగళవారం రాత్రి హింసాత్మక ప్రాంతాల్లో పర్యటించారు. పోలీసు అధికారులతో కూడా పరిస్థితిని సమీక్షించారు. 

సీలంపూర్, జాఫ్రాబాద్, మౌపర్, గోలక్ పురి చౌక్ వంటి ప్రాంతాల్లో పర్యటించిన అజిత్ దోవల్ పరిస్థితిని క్షుణ్ణంగా గమనించారు. మరోవైపు ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై చర్చించేందుకు, భద్రతా చర్యలకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర కేబినెట్ భ్రద్రతా కమిటీ కూడా సమావేశం కానుంది.  

కేబినెట్ భద్రతా కమిటీ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొని పరిస్థితిని వివరించనున్నారు.