ఢిల్లీలో ఖాకీ Vs నల్లకోటు: పోలీసుల ఆందోళన, హెడ్‌క్వార్టర్స్ ముట్టడి, న్యాయవాదులపై చర్యలకు డిమాండ్

12:48 am, Thu, 7 November 19
delhi-police-protest

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ రణరంగంగా మారింది. ఢిల్లీ పోలీసులు, న్యాయవాదులకు మధ్య తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. న్యాయవాదుల తీరుకు నిరసనగా పోలీసులు ఆందోళన బాట పట్టారు. శనివారం జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ చూసి తప్పెవరిదో తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినదించారు.

మరోవైపు ఢిల్లీ పోలీసుల నిరసనకు వివిధ రాష్ట్రాల పోలీసుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఐపీఎస్ అసోసియేషన్ కూడా వీరికి మద్దతు తెలిపింది. ఆందోళన విరమించాలంటూ ఆ శాఖ ఉన్నతాధికారులు కోరినా ఫలితం లేకుండాపోయింది. తప్పు చేసిన వారిని గుర్తించి శిక్షించే వరకు తాము ఆందోళన వీడేది లేదంటూ, తమకు న్యాయం చేస్తామని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు డిమాండ్ చేస్తున్నారు.

ఢిల్లీ పోలీసు కమిషనర్ పట్నాయక్ ఈ పరిస్థితిని కేంద్ర హోంశాఖ అధికారులకు వివరించారు. మరోవైపు ఢిల్లీ హైకోర్టు ఈ ఘటనను సుమోటాగా తీసుకుంటూ ఆదివారం విచారణ జరిపి, జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. స్పెషల్ కమిషనర్ సంజయ్ సింగ్‌ను సస్పెండ్ చేయడంతోపాటు పలువురు పోలీసు అధికారులపై కూడా చర్యలకు ఆదేశించింది. అయితే ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై కేంద్ర హోం శాఖ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయడంతో, ఢిల్లీ హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులకు సమన్లు పంపింది.

police-vs-lawyers-issue-in-delhiఅసలు గొడవ ఇదీ…

శనివారం తీస్ హజారీ కోర్టు వద్ద పార్కింగ్ విషయంలో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది పోలీసులు, 40 మంది న్యాయవాదులు గాయపడ్డారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్టు ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరో ఇద్దరిపైనా వేటు వేయడమేకాక.. గాయపడిన న్యాయవాదులకు పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించింది.

అలాగే సాకేత్ కోర్టులో కూడా ఓ పోలీసుపై న్యాయవాదులు దాడికి పాల్పడ్డారు. తమపై దాడులకు పాల్పడుతోన్న న్యాయవాదులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, హైకోర్టు కూడా తమనే తప్పుబట్టడంతో పోలీసుల్లో ఆవేదన వ్యక్తమైంది. ఇదిలా ఉండగా ఈ ఘర్షణలకు పోలీసులే కారణమని ఆరోపిస్తూ సోమవారం న్యాయవాదులు నిరసనకు దిగారు. అయితే న్యాయవాదుల వల్లే ఘర్షణ వాతావరణం నెలకొందని, అందువల్లే తాము ముందు జాగ్రత్త చర్యగా గాల్లోకి కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నారు.

న్యాయం కోరుతూ రోడ్డెక్కిన పోలీసులు…

ఈ నేపథ్యంలో ఖాకీలు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే ఆందోళనకు దిగడం, ఏకంగా పోలీసు హెడ్ క్వార్టర్స్ ఎదుటే నిరసనకు దిగడంతో.. ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచి, నిరసన విరమించి విధులకు హాజరుకావాలంటూ ఢిల్లీ పోలీసు కమిషనర్ పట్నాయక్ ఆందోళన చేస్తోన్న పోలీసులను కోరారు.

సోమవారం కూడా పోలీసులపై న్యాయవాదులు దాడి చేయడం క్షమించరాదని వ్యాఖ్యానించిన ఆయన చట్టపరంగా పోరాడుదామంటూ పోలీసు సిబ్బందికి పిలుపునిచ్చారు. తొలుత ఈ ఘటన జరిగిన వెంటనే కొంతమంది పోలీసులు మాత్రమే నిరసన తెలిపారు. తరువాత ఈ వార్త దావానలంతా వ్యాపించడంతో.. వందల సంఖ్యలో పోలీసులు తమ విధులు బహిష్కరించి పోలీసు ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకుని అప్పటికే అక్కడ ఆందోళన చేస్తోన్న పోలీసులకు తమ సంఘీభావం తెలిపారు. వారి గొంతుకలతో వీరూ గొంతులు కలిపారు.

ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని, న్యాయం జరుగుతుందని తమకు హామీ ఇవ్వాలని, అంత వరకు వెనక్కి తగ్గేది లేదంటూ వారు తేల్చిచెప్పడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గంటలు గడిచే కొద్దీ నిరసనలో పాల్గొంటోన్న పోలీసుల సంఖ్య పెరిగిపోతుండడం, భారీగా ట్రాఫిక్ నిలిచిపోతుండడంతో.. ట్రాఫిక్ పోలీసులు ఒక మార్గాన్ని మూసివేశారు.

కిరణ్ బేడీ మళ్లీ రావాలంటూ…

మంగళవారం పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద​ నిరసనకు దిగిన పోలీసు సిబ్బంది.. కమిషనర్ పట్నాయక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటి పోలీసులకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకోరా అంటూ ప్రశ్నించారు. ‘కమిషనర్ ఆఫ్ పోలీస్ అంటే ఎలా ఉండాలి.. కిరణ్ బేడీలా ఉండాలి..’ అంటూ నినాదాలు చేశారు. అంతేకాదు మళ్లీ కమిషనర్‌గా రావాలంటూ కిరణ్ బేడీ ఫొటోలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.

దాడులకు బాధ్యులైన న్యాయవాదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాదాపు 11 గంటల ప్రాంతంలో ఉన్నతాధికారుల హామీతో వారు తమ ఆందోళనను విరమించారు. కొంతమంది పోలీసులు తాము నిరసనలు చేపట్టేందుకు రాలేదని, తమ బాధను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు వచ్చామని చెప్పారు. న్యాయ వృత్తిలో ఉన్నవారే పోలీసులపై చేయి చేసుకుంటే ఇక సామాన్య ప్రజలు తమను లెక్కచేస్తారా? అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో…

సోమవారం ఉదయం కూడా పోలీసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పోలీస్ హెడ్‌క్వార్టర్స్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ‘వుయ్ వాంట్ జస్టిస్..’ అంటూ నినదించారు. ఢిల్లీ పోలీసు కమిషనర్ పట్నాయక్.. ఆందోళన విరమించాలని కోరినా వారు వెనక్కి తగ్గలేదు. ప్రశాంతంగా ఉండాలని, విధుల్లో చేరాలని ఉన్నతాధికారులు చేసిన విజ్ఞప్తులకు ‘గో బ్యాక్‌.. గో బ్యాక్‌’ అంటూ బదులిచ్చారు.

సాయంత్రం వరకు వారి ఆందోళన తగ్గకపోవవడంతో స్పెషల్‌ పోలీస్‌ కమిషనర్‌ సతీశ్‌ గోల్చా.. బయటికొచ్చి తీస్‌హజారీ కోర్టు ఆవరణలో శనివారం జరిగిన ఘటనపై ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై రివ్యూ పిటిషన్‌ వేస్తామని, క్షతగాత్రులైన పోలీసులకు రూ.25 వేల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పోలీసులు తమ ఆందోళనను విరమించారు.

మరోవైపు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ మనన్‌ కుమార్‌ మిశ్రా మాట్లాడుతూ.. ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన న్యాయవాదులను గుర్తించి, వారి పేర్లు తెలపాలని కోరారు. కొంతమంది న్యాయవాదుల దౌర్జన్యపూరిత ప్రవర్తన కారణంగా న్యాయవాదులందరికీ చెడ్డ పేరు వస్తోందంటూ మిశ్రా కూడా ఆవేదన వ్యక్తం చేశారు.