షాకింగ్: నాకు మోడీ ఎంతో ఇమ్రాన్ అంతే: ఇండియా టూర్‌లో ట్రంప్ వ్యాఖ్యలు…

8:50 pm, Tue, 25 February 20
Donald Trump in India Tour

న్యూఢిల్లీ: భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కశ్మీర్ అంశంపై ఢిల్లీలో మాట్లాడుతూ పాకిస్తాన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం భారత-అమెరికా సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. అంతేకాదు, తనకు భారత ప్రధాని మోడీ ఎంతో.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా అంతే అని చెప్పారు.

అమెరికాను గతంలో ఎన్నడూ ఇండియా ఇంతగా అభిమానించలేదని వ్యాఖ్యానించిన ట్రంప్, అహ్మదాబాద్‌లో తమకు భారత్ ఇచ్చిన ఘన స్వాగతాన్ని జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేనని అన్నారు.  భారత్‌తో 3 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, ఇంధన రంగంలోనూ పెట్టుబడులు పెరిగాయని ట్రంప్ చెప్పారు.

కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికీ సిద్ధం… 

తనకు భారత్ ఎంతో పాకిస్తాన్ కూడా అంతేనని, భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలకు కశ్మీర్ అంశమే కారణమన్నారు. స్రతి అంశాన్ని ఇరువైపులా చూడాలని, కశ్మీర్ విషయంలో భారత్‌తోపాటు పాకిస్తాన్ వాదనలు కూడా వినాలన్నారు.

తనకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తోనూ మంచి సంబంధాలు ఉన్నాయని, కశ్మీర్ అంశంపై భారత్-పాక్‌ల నడుమ మధ్యవర్తిత్వానికి కూడా తాను సిద్ధమేనని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.

అవి భారత్ అంతర్గత విషయాలు…

కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి, ఆర్టికల్ 370 అంశాలపై తాను మాట్లాడేదేమీ ఉండదని, ఎందుకంటే అవి పూర్తిగా భారత్ అంతర్గత విషయాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. 

సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు తన దృష్టికి కూడా వచ్చాయని, అయితే ఈ విషయాన్ని తాను ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడలేదని, తనకు ఆయనపై పూర్తి నమ్మకం ఉందని, కాకపోతే మత స్వేచ్ఛను కాపాడాలంటూ సూచించానని చెప్పారు. 

భారత్ ఎంతో ధైర్యం కలిగిన దేశమని, ఉగ్రవాదాన్ని ప్రధాని మోడీ సమర్థవంతంగా ఎదుర్కోగలరని ట్రంప్ ప్రశంసించారు. అదేసమయంలో ఉగ్రవాదంపై పోరులో తనను మించిన వారు లేరంటూ నవ్వేశారు.