ఈడీ కార్యాలయంలో ముగ్గురికి కరోనా.. కార్యాలయం మూత

7:51 pm, Sat, 6 June 20

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని కలవరపెడుతోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 70 లక్షలకు చేరువవుతోంది. మన దేశంలోనూ ఈ వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.

దేశంలో ఇప్పటికే నమోదైన కేసుల సంక్య 2 లక్షల మార్కును దాటేసింది. కరోనా దెబ్బకు సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల వరకు అందరూ విలవిల్లాడుతున్నారు. భయంతో వణుకుతున్నారు. 

తాజాగా, ఈ వైరస్ ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయాన్ని కూడా తాకింది. ఇక్కడ పనిచేస్తున్న ముగ్గురు అధికారులకు వైరస్ సోకడంతో కార్యాలయాన్ని మూసేశారు.

 మరో ఇద్దరు ఉద్యోగులకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో లోక్‌నాయక్ భవన్‌ను శానిటైజేషన్ చేసి సీజ్ చేశారు. ఆదివారం వరకు ఈ కార్యాలయాన్ని సీజ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

బాధిత అధికారులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి కుటుంబ సభ్యలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ముందస్తు జాగ్రత్తగా కరోనా పాజిటివ్ వచ్చిన వారితో కలిసి పనిచేసిన వారందర్నీ క్వారంటైన్‌కు తరలించారు.