షాక్: ఎన్నికల వేళ 146 కిలోల బంగారం సీజ్ చేసిన ఈసీ బృందం

10:58 am, Sat, 6 April 19
gold bars

చెన్నై: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారీ స్థాయిలో అక్రమంగా తరలిస్తున్న నగదు, బంగారం పోలీసులు, ఎన్నికలు అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా, తమిళనాడులో ఏకంగా 146కిలోల బంగారాన్ని ఎన్నికల అధికారులు సీజ్ చేయడం గమనార్హం. ఎలాంటి రసీదులు లేని అంత బంగారాన్ని చూసిన అధికారులు కూడా షాక్‌కు గురయ్యారు.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు సమీపంలోని పులియాకుళం ప్రాంతంలో ఎన్నికల అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ఓ వ్యాన్‌ని నిలువరించి సోదాలు చేయగా పెద్దమొత్తంలో బంగారం కడ్డీలు ఉన్నట్టు గుర్తించారు.

146కిలోల బంగారం చూసి..

బయటకు తీస్తే ఏకంగా 146 కిలోల బంగారం ఉండడంతో ఆశ్చర్యపోయారు. వ్యాన్‌ సిబ్బందిని ప్రశ్నించగా ఓ ప్రముఖ బంగారం దుకాణానికి సరఫరా చేసేందుకు తీసుకువెళ్తున్నామని వారు చెప్పినా.. అందుకు సంబంధించి సరైన ఆధారాలు మాత్రం చూపించలేదు.

ఈ క్రమంలో బంగారు నగలను, వ్యాన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల వేళ భారీగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమయింది. ఈ బంగారం నిజంగా ఆ దుకాణాదారుడిదేనా? అనేది అధికారుల దర్యాప్తులో తేలనుంది.

చదవండి: ప్రధాని మోడీపై మరోసారి నోరుపారేసుకున్న బాలకృష్ణ: కేసీఆర్, జగన్‌పైనా..