ఐఐటీ ఎంట్రెన్స్‌లో ఫెయిల్.. అయినా రూ.1.2కోట్ల ఆఫర్ కొట్టేశాడు!

Failure of IIT Entrance News, IIT Latest News, Newsxpressonline
- Advertisement -

ముంబై: ఐఐటీలకు మాత్రమే దక్కుతుంది అనుకున్న గూగుల్ ఉద్యోగం మామూలు ఇంజినీరింగ్ చదివిన విద్యార్థి దక్కించుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఒకప్పుడు ఐఐటీ ఎంట్రెన్స్‌ను క్రాక్ చేయలేక ఇబ్బందులు పడ్డ ఆ యువకునికి ఇప్పుడు గూగుల్ పిలిచి మరీ ఉద్యోగమిచ్చింది. జాబ్‌కు అప్లై చేయకున్నా అతనిలోని టాలెంట్‌ను గుర్తించి రూ.1.2కోట్ల శాలరీ ఆఫర్ చేసింది.

ముంబై మీరా రోడ్‌కు చెందిన అబ్దుల్లా ఖాన్ సౌదీ అరేబియాలో పాఠశాల విద్య పూర్తి చేశాడు. ఐఐటీలో చదవాలన్నది మనోడి కల. ఇదే సంకల్పంతో ఇండియాకు వచ్చి ఎంట్రన్స్ రాశాడు. అయితే జెఈఈ అడ్వాన్స్‌ను క్రాక్ చేయలేకపోవడంతో నిరాశ చెందాడు. ఆ తర్వాత శ్రీ ఎల్ ఆర్ తివారీ ఇంజనీరింగ్ కాలేజీలో బీఈలో జాయిన్ అయ్యాడు.

కంప్యూటర్ కోడింగ్ అంటే అబ్దుల్లాకు ప్రాణం. అందుకే గూగుల్ ప్రోగ్రామింగ్ కాంపిటీషన్‌లో పాల్గొనేందుకు తన ప్రొఫైల్ అప్‌లోడ్ చేశాడు. దాన్ని చూసి ఇంప్రెస్ అయిన గూగుల్ అధికారులు ఇంటర్వ్యూకు రమ్మని గతేడాది నవంబర్‌లో అబ్దుల్లాకు మెయిల్ పంపారు.

తొలుత అబ్దుల్లా దీన్ని నమ్మలేదు. తన ఫ్రెండ్‌కు తెలిసినవారికి కూడా గతంలో ఇలాంటి మెయిల్ వచ్చిందని తెలియడంతో పూర్తి వివరాలు కనుక్కున్నాడు. ఆ తర్వాత పలు రౌండ్ల ఇంటర్వ్యూలకు హజరై విజయం సాధించాడు. ఈ ఏడాది మార్చి మొదటివారంలో లండన్‌లో జరిగిన ఫైనల్ స్క్రీనింగ్ టెస్ట్‌లోనూ సక్సెస్ కావడంతో గూగుల్ బంపర్ ఆఫర్‌తో జాబ్‌కు సెలెక్ట్ చేసింది.

అబ్దుల్లా ప్రతిభను గుర్తించిన గూగుల్ లండన్ ఆఫీస్‌లో రిలయబిలిటీ ఇంజనీరింగ్ టీం మెంబర్‌గా సెప్టెంబర్‌లో జాయిన్ కావాలంటూ లెటర్ పంపింది. ఏడాదికి రూ.54.5 లక్షల వేతనంతో పాటు 15శాతం కంపెనీ బోనస్‌, నాలుగేళ్లకు కలిపి 58.9లక్షల విలువైన కంపెనీ షేర్లు ఆఫర్ చేసింది. వీటన్నింటినీ కలిపితే ఏడాదికి అబ్దుల్లా పొందే జీతం అక్షరాలా రూ.1.2కోట్లు. ఐఐటీకి సెలెక్ట్ కాని తనకు ఇంత భారీ ఆఫర్‌తో గూగుల్ ఉద్యోగమిస్తుండటంతో అబ్దుల్లా ఆనందం పట్టలేకపోతున్నాడు.

- Advertisement -