అంత్యక్రియలకు డబ్బుల్లేక.. గిరిజన మహిళ మృతదేహాన్ని నదిలోకి విసిరేసిన కుటుంబ సభ్యులు!

2:49 pm, Wed, 1 July 20

భోపాల్: మధ్యప్రదేశ్‌లో జరిగిన దారుణ ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చి గుండెలు పిండేస్తోంది. ఓ గిరిజన మహిళ అనారోగ్యంతో మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బుల్లేక ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు నదిలో విసిరేశారు. ఆదివారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సిధీ జిల్లాకు చెందిన గిరిజన మహిళ నెల రోజుల క్రితం అనారోగ్యం బారినపడింది. తాజాగా, ఆమెను ఎడ్లబండిలో జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు నిర్ధారించారు.

దీంతో బోరుమన్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ కోసం ప్రయత్నించారు. అయితే, ఆదివారం కాబట్టి అంబులెన్స్ సమకూర్చలేమని మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పేశారు. దీంతో ఎడ్లబండిపైనే తిరిగి మృతదేహాన్ని తీసుకుని బయలుదేరారు.

అయితే, దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో వెళ్తూవెళ్తూ సోన్ నదిలోకి మృతదేహాన్ని వదిలేశారు. దారినవెళ్తున్న వారు వీడియో తీసి సోషల్ మీడిలో పోస్టు చేయడంలో వైరల్ అయింది.

విషయం తెలిసిన సిధీ జిల్లా అదనపు కలెక్టర్ డీపీ బర్మాన్ స్పందించారు. ఇది చాలా దురదృష్టకర ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాలను దహనం చేసేందుకు ప్రభుత్వ పథకం ఉందని తెలియక వారు అలా చేసి ఉంటారని పేర్కొన్నారు.

ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు చెప్పారు. కాగా, ఈ ఘటనపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. శివరాజ్ సింగ్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. గిరిజన మహిళ మృతదేహం నదిలో ఎందుకు తేలాల్సి వచ్చిందని మాజీ సీఎం కమల్ ‌నాథ్ ప్రశ్నించారు.

కాంగ్రెస్ విమర్శలను బీజేపీ కొట్టిపారేసింది. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దని బీజేపీ నేత డాక్టర్ హితేశ్ బాజ్‌పాయ్ హితవు పలికారు.