తలొగ్గిన కేంద్రం: ఢిల్లీలోకి రైతన్నల ప్రవేశానికి అనుమతి.. ముగిసిన కిసాన్ ర్యాలీ…

kisan-rally1
- Advertisement -

farmers-protest-delhi

న్యూఢిల్లీ : రుణ మాఫీ తదితర డిమాండ్లతో భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) తలపెట్టిన కిసాన్ క్రాంతి యాత్ర ఎట్టకేలకు బుదవారం ఉదయం ముగిసింది. మంగళవారం ఈ యాత్రను పోలీసులు ఢిల్లీ -ఉత్తర ప్రదేశ్ సరిహద్దుల్లో అడ్డుకున్న విషయం తెలిసిందే. బీకేయూ అధ్యక్షుడు నరేశ్ తికాయత్ ఆధ్వర్యంలో ట్రాలీలు, ట్రాక్టర్‌లతో ర్యాలీగా వస్తున్న రైతులను దేశరాజధాని ఢిల్లీ నగరంలోకి అనుమతి ఇవ్వకుండా పోలీసులు ర్యాలీకి అడ్డుగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాటిని ధ్వంసం చేసి ముందుకు ప్రవేశించే ప్రయత్నం చేసిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్సవాయువు, వాటర్‌క్యానన్‌లను ప్రయోగించారు.

- Advertisement -

అయినా కూడా రైతులు వెనకడగు వేయలేదు. అర్థరాత్రి అయినా వెనక్కి వెళ్ళకుండా అక్కడే బస చేశారు. మరోవైపు పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు రావడంతో అర్థరాత్రి  సమయంలో తాము ఏర్పాటు చేసిన బారికేడ్లు తొలగించి ర్యాలీని అనుమతించారు. దీంతో రైతులు చేపట్టిన కిసాన్ ర్యాలీ  బుధవారం తెల్లవారుజామున కిసాన్ ఘాట్ వద్ద ముగిసింది.

ఈ సందర్భంగా నరేశ్ తికాయత్ మాట్లాడుతూ.. ‘ఇది రైతుల విజయం, బీజేపీ ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించడంలో చాలా దారుణంగా విఫలమైంది. మేం గత 12 రోజులుగా ఈ ర్యాలీ చేస్తున్నాం. రైతులంతా చాలా అలసిపోయారు. మేం మా డిమాండ్స్, హక్కుల కోసం మా పోరాటం కొనసాగిస్తునే ఉంటాం. కానీ ప్రస్తుతం ఈ ర్యాలీని ముగిస్తున్నాం. పండిన పంటకు తగిన గిట్టుబాటు ధర ఇవ్వాలన్నతమ ప్రధాన డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించిది’’ అని తెలిపారు.

గత నెల 23న కూడా తమ డిమాండ్ల సాధన కోసం బీకేయూ ఇచ్చిన పిలుపు మేరకు రైతులు  హరిద్వార్ నుంచి ర్యాలీగా బయలుదేరిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీలో ఉత్తర ప్రదేశ్,  పంజాబ్,  ఉత్తరాఖండ్, హరియాణాతోపాటు మరికొన్ని ప్రాంతాలకు చెందిన దాదాపు 70 వేల మంది రైతులు పాల్గొన్నారు.

- Advertisement -