పెద్దలను ఒప్పించి పెళ్లాడిన మగువలు.. స్నేహితురాలి కోసం పురుషుడిగా మారిన యువతి!

1:31 pm, Fri, 14 February 20

ఒడిశా: ఇంజినీరింగ్ వరకు కలిసి చదువుకున్న ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ బంధం పెనవేసింది. ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు.

అప్పుడు కానీ వారికి తాము ఒకరిని విడిచి మరొకరం ఉండలేమని అర్థమైంది. పెళ్లి చేసుకుని కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఓ స్నేహితురాలు లింగమార్పిడి ద్వారా పురుషుడిగా మారాలని నిర్ణయించుకుంది.

కుటుంబ సభ్యులకు చెప్పి, ఒప్పించి…

ఇదే విషయాన్ని వారు తమ కుటుంబ సభ్యులకు చెప్పి ఒప్పించారు. తల్లిదండ్రుల అనుమతితో ఓ అమ్మాయి లింగమార్పిడి చేయించుకుని పురుషుడిగా మారింది (మారాడు).

ఫిబ్రవరి 14.. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే, ఈ నెల 10న దివ్యమైన ముహూర్తం కుదరడంతో బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది.

ఒడిశాలోని మల్కనగిరి జిల్లాలో జరిగిన ఈ ఘటన నిన్న వెలుగులోకి వచ్చింది.