లాక్‌డౌన్ ఎఫెక్ట్: రూ. 1.70 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటన

4:45 pm, Thu, 26 March 20

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌‌పై భారత్ పోరు ప్రారంభించింది. అందులో భాగంగా వచ్చే నెల 14వ తేదీ వరకు ప్రబుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది.

అయితే, ఈ నిర్ణయం కారణంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు రోడ్డున పడ్డారు. వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ‘గరీబ్ కల్యాణ్’ పేరుతో రూ. 1.70 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు.

ప్యాకేజీలోని ముఖ్యాంశాలు ఇవే..

‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన’ పేరుతో ప్రకటించిన ఈ పథకం కింద రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ చేస్తారు. 8.69 కోట్ల మంది రైతులకు మొదటి విడతగా రూ.2000 విడుదల చేస్తారు.

ఏప్రిల్ మొదటివారంలో ఖాతాల్లోకి సొమ్ము జమ అవుతుంది. 80 కోట్ల మంది పేదలకు 5 కేజీల చొప్పున గోధుమలు, లేదంటే 5 కేజీల చొప్పున బియ్యం, కిలో పప్పు దినుసులు అందిస్తారు.

ఆహార ధాన్యాలు వచ్చే నెల నుంచి 3 నెలల పాటు ఉచితంగా అందిస్తారు. వైద్యులు, పారామెడికల్, హెల్త్ కేర్ రంగాల సిబ్బందికి రూ. 50 లక్షల విలువైన బీమా సౌకర్యం కల్పిస్తారు.

20 కోట్ల “జన్‌ధన్” మహిళా ఖాతాల్లో మూడు నెలల పాటు రూ. 500 చొప్పున జమ చేస్తారు.

3 కోట్ల మంది వృద్ధులు, దివ్యాంగులు, పెన్షనర్ల ఖాతాల్లోకి అదనంగా నెలకు రూ. 1000 చొప్పున మూణ్ణెళ్ల పాటు (రెండు విడతలుగా నేరుగా ఖాతాల్లోకి) జమ చేస్తారు.

“ఉజ్వల” పథకం లబ్ధిదారులకు రానున్న 3 నెలలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారు.

63 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 20 లక్షల వరకు తనఖా లేని రుణాలు, తద్వారా 7 కోట్ల కుటుంబాలకు లబ్ధి.