పాకిస్తాన్‌కు గట్టి షాక్! యూటీ పరిధిలోకే పీఓకే, ఇక కేంద్రానికి ఫుల్ పవర్స్…

12:10 am, Tue, 6 August 19
imran-khan-narendra-modi

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తోన్న ఆర్టికల్ 370ని రద్దు చేయడం, జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం ద్వారా కేంద్రంలోని మోడీ సర్కార్ పాకిస్తాన్‌కు గట్టి షాక్ ఇచ్చింది.

రెండోసారి అధికారంలోకి వస్తే గనుక ఏడు దశాబ్దాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన కశ్మీర్ సమస్యను పరిష్కరించాలని  భావించిన ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఆ దిశగా ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. 

అంతేకాదు, పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) కూడా కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోకే వస్తుందంటూ కేంద్రం బాంబు పేల్చింది. దీంతో సోమవారం ఉదయం నుంచి ఎప్పటికప్పుడు మారుతోన్న పరిణామాలను చాలా నిశితంగా గమనిస్తోన్న పాకిస్తాన్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 

మోడీ సర్కార్ వ్యూహాత్మ‌క అడుగులు…

పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ మీద ప‌ట్టు బిగించడం కోసం కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదం గురించి అంత‌ర్జాతీయ వేదిక‌ల మీద ప్ర‌స్తావించిన భారత్.. దౌత్య ప‌రంగా ఆ దేశాన్ని ఏకాకిని చేసింది. మరో మాటలో చెప్పాలంటే భారత్ అంత‌ర్జాతీయ స‌మాజంలో పాకిస్తాన్‌ను ఒంట‌రిని చేసింది.

ఒకవైపు ఆర్దిక‌ంగా పూర్తిగా దిగజారిపోయి కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ మరోవైపు పాల‌నా ప‌ర‌మైన ఇబ్బందుల‌తోనూ స‌త‌మ‌తం అవుతోంది. దీంతో పాకిస్తాన్‌ను దెబ్బ తీయటానికి ఇదే సరైన సమయమని భారత్ భావించింది.

అసలు లక్ష్యం ఇదీ: నిర్మలా సీతారామన్

అయితే జమ్మూ కశ్మీర్ విభజన విషయంలో మోడీ సర్కారు అసలు లక్ష్యం ఏమిటన్నది ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బయటపెట్టారు.

సోమవారం రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోకే పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) కూడా వస్తుందంటూ బాంబు పేల్చారు. తద్వారా పీఓకే విముక్తే తమ అసలు లక్ష్యమంటూ ఆమె చెప్పకనే చెప్పారు. 

కశ్మీర్ నుంచి పాకిస్తాన్‌ను పారదోలాలంటే…

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ ను‌ంచి పాకిస్తాన్‌ను పారదోలి ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవాలంటే.. ముందుగా జ‌మ్మూ కాశ్మీర్‌ను పూర్తిగా త‌మ నియంత్ర‌ణ‌లోకి తెచ్చుకోవడం అనివార్యమని భావించిన మోడీ సర్కార్ ఆ దిశగా పావును కదిపింది. 

జ‌మ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ప్రసాదించిన భారత రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేస్తూ తాజాగా కేంద్రం నిర్ణ‌యం తీసుకోవడమే కాకుండా.. జ‌మ్మూ కాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.

జ‌మ్ము కాశ్మీర్‌‌ను అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా, ల‌ఢ‌ఖ్‌ను అసెంబ్లీ లేని (చంఢీఘ‌ర్ త‌ర‌హా) కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించింది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని కేంద్రం సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఫలితంగా ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తితో ఉన్న జ‌మ్మా కాశ్మీర్ ఇకమీదట పూర్తిగా కేంద్రం ప‌రిధిలోకి రానుంది.

మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ, ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ.. కేంద్రం పెత్తనమే కొనసాగనుంది. ఇక ల‌డ‌ఖ్‌ పూర్త‌ిగా కేంద్ర‌ం ప‌ర్య‌వేక్ష‌ణలోనే ఉంటుంది. అలాగే పీఓకే సైతం కేంద్ర పాలిత ప్రాంత ప‌రిధిలోకి రావ‌టంతో కేంద్రానికి దానిపైనా అజ‌మాయిషీకి అవ‌కాశం ఏర్ప‌డుతోంది.