కరోనా భయం: ల్యాండింగ్‌కు ‘నో’.. వెనుదిరిగిన ఫ్లైట్, అందులో 90 మంది భారతీయులు!

1 week ago
flight-makes-u-turn-as-india-denies-permission-to-land

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న భారతీయులు నానా అవస్థలు పడుతున్నారు. దేశంకాని దేశంలో నివసిస్తూ.. స్వదేశానికి తిరిగి రాలేని నిస్సహాయ స్థితిలో గడుపుతున్నారు.

కరోనా వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో దేశంలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల్లో విదేశీ విమానాల ల్యాండింగ్‌కు భారత్ అనుమతి నిరాకరించడంతో… వారి కష్టాలు మరింత అధికమయ్యాయి.

చదవండి: కరోనా అప్‌డేట్: దేశంలో 258కి పెరిగిన పాజిటివ్ కేసులు, ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులంటే…

తాజాగా ఢిల్లీ విమానాశ్రయంలో ఇదే జరిగింది. డెన్మార్క్‌లోని ఆమ్‌స్టర్ డ్యామ్ నుంచి వచ్చిన విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు అవకాశం లేక తిరిగి వెనక్కి వెళ్లిపోయింది. అయితే ఆ విమానంలో 90 మంది భారతీయులు కూడా ఉన్నారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేఎల్ఎం డచ్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం శుక్రవారం ఆమ్‌స్టర్ డ్యామ్ నుంచి ఢిల్లీకి వచ్చింది. ఈ విమానంలో 90 మంది భారతీయులు ఉన్నారు. అయితే, విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు అధికారులు అనుమతించలేదు. విమాన సిబ్బందికి వారు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

18 నుంచే విమానాల రాకపోకలు బంద్…

నిజానికి యూరోపియన్ దేశాల నుంచి విమాన రాక పోకలను భారత్ ఈనెల 18వ తేదీనే బంద్ చేసింది. కేఎల్ఎం డచ్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం శుక్రవారం ఆమ్‌స్టర్ డ్యామ్ నుంచి ఢిల్లీకి రావడం గమనార్హం.

ఈ సందర్భంగా డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌ అధికారులు మాట్లాడుతూ.. నిర్ధారిత ఫ్లైట్ ప్లాన్ లేకుండానే కేఎల్ఎం ఎయిర్ లైన్స్ విమానం మన దేశంలో ల్యాండ్ అవడానికి వచ్చిందని, అయితే తమకున్న గైడ్‌లైన్స్ ప్రకారం అందుకు అవకాశం లేదని, అందువల్లే ఆ విమానం ల్యాండ్ కావడానికి తాము పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు.

చదవండి: హమ్మయ్య.. వచ్చేశారు: ఇరాన్ నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌కు చేరుకున్న 58 మంది భారతీయులు

అయితే విమానంలోని భారతీయులు మాత్రం అధికారుల చర్యతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అప్పటికే వారు ఎంతో సంతోషంతో కాసేపట్లో తాము స్వదేశంలో ల్యాండ్ అవబోతున్నామంటూ తమ కుటుంబసభ్యులు, స్నేహితులకు మెసేజ్‌లు కూడా పంపారు.

అయితే వారి ఆశలు కాసేపట్లోనే నిరాశలయ్యాయి. విమానం ల్యాండ్ అవడం లేదని, తిరిగి వెనక్కి వెళుతోందనే అనౌన్స్‌మెంట్‌తో వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు.

రేపు ఉదయం నుంచి నో ఫ్లయింగ్…

ఇదిలా ఉండగా, రేపు అంటే ఆదివారం(మార్చి 22వ తేదీ) ఉదయం 5.50 గంటల నుంచి అన్ని విదేశీ విమానాల రాకపోకలను మన దేశం నిలిపివేస్తోంది. దీంతో ప్రపంచ దేశాలతో భారత్‌కు ఉన్న విమాన మార్గాలు తాత్కాలికంగా మూతపడినట్లే.

చదవండి: కరోనా వైరస్: నా వంతు సేవలు వాడుకోండి.. తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేఏ పాల్ ఆఫర్!

అంటే.. ఆదివారం నుంచి మన దేశం నుంచి ఏ ఒక్కరూ ఇతర దేశాలకు వెళ్లడం కానీ… ఇతర దేశాల నుంచి మన దేశానికి రావడం కానీ జరగదన్నమాట. అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే ఏ విమానమైనా దేశ సరిహద్దులను దాటే పరిస్థితి ఉంటుంది.

ఈ నిబంధనలు మార్చి 29వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి కేంద్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయాన్ని తీసుకుంటుంది.