మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత.. ధ్రువీకరించిన తనయుడు

Former President of India Pranab Mukherjee Passes Away
- Advertisement -

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా  ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కన్నుమూశారు. 

ఈ విషయాన్ని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ తీవ్ర అస్వస్థతకు గురై ఈ నెల 10న ఆసుపత్రిలో చేరారు. 

- Advertisement -

ఆయన మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్స కూడా చేశారు. మరోవైపు ఆయన కరోనా బారిన పడినట్లు కూడా వైద్యులు గుర్తించారు. 

అప్పట్నించి వైద్యుల పర్యవేక్షణలో ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్ చివరికి పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. 

పశ్చిమ బెంగాల్‌లోని మిరాటిలో 1935 డిసెంబర్ 11న జన్మించిన ప్రణబ్ ముఖర్జీ గ్రాడ్యుయేషన్ తరువాత పొలిటికల్ సైన్స్, చరిత్రలో మాస్టర్స్ చదివారు. 

కోల్‌కతా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టాను పొందిన ప్రణబ్ సువ్రా ముఖర్జీని వివాహమాడారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 

రాజకీయాల్లోకి రాకమునుపు ప్రణబ్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో యూడీసీగా పని చేశారు. కొంతకాలం విద్యానగర్ కళాశాలలో అధ్యాపక వృత్తిని కూడా చేపట్టారు. బెంగాలీ పత్రిక ‘దెషర్ దక్’లో జర్నలిస్టుగానూ పనిచేశారు. 

ఆయన తండ్రి కె.కె.ముఖర్జీ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. పశ్చిమ బెంగాల్ శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం కూడా వహించారు. 

రాజకీయాల్లో ప్రణబ్ ముఖర్జీ అడుగు 1969లో పడింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయన్ని కాంగ్రెస్ తరుపున రాజ్యసభకు పంపించారు. ఆ తరువాత ఆయన ఇందిరకు అత్యంత నమ్మకస్తుడిగా మారారు. 

1973లో ఇందిర మంత్రివర్గంలో కూడా చోటు సంపాదించారు. 1982లో ప్రణబ్ అత్యంత పిన్న వయసులో దేశ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ఆయన వయసు 47 ఏళ్లు. 

ప్రణబ్ బహుముఖ ప్రజ్ఞాశీలి. తన యాభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన అనేక ఉన్నత పదవులు నిర్వహించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో వివాద పరిష్కర్తగా పేరు పొందారు. 

ప్రణబ్‌ ముఖర్జీని ఆయన సన్నిహితులు ‘ప్రణబ్ దా’ అని పిలుచుకునే వారు. ప్రణబ్ సతీమణి సువ్రా ముఖర్జీ 2015 ఆగస్టులో కన్నుమూశారు. 

 

 

- Advertisement -