టీ షర్ట్‌పై ‘నమో అగైన్’: యువతిపై దురుసు ప్రవర్తన, ప్రియాంక ర్యాలీలో ఘటన

2:28 pm, Thu, 21 March 19
Congress Latest rally News, Priyanka Gandhi Latest News, Narendra modi Latest News, Newsxpressonline

వారణాసి: టీషర్ట్ పై ‘నమో అగైన్’ అని రాసి ఉన్నందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఓ యువతితో దురుసుగా ప్రవర్తించారు. ఆమెను ప్రియాంకగాంధీ ర్యాలీనుంచి దూరంగా గెంటేశారు. ఈ ఘటన వారణాసిలో బుధవారం జరిగిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ర్యాలీలో చోటు చేసుకోవడం గమనార్హం.

యువతి పట్ల దురుసు ప్రవర్తన..

అస్సీ ఘాట్‌ వద్ద ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో స్థానిక కాలేజీకి చెందిన ఓ యువతి ‘నమో అగైన్‌’ అని రాసి ఉన్న నీలిరంగు టీ షర్ట్‌ను ధరించి అటుగా నడుచుకుంటూ వెళుతోంది. అయితే, కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆమె చుట్టూ మూగి.. దురుసుగా ప్రవర్తించారు.

‘చౌకీదార్‌ చోర్ హై’ అంటూ నినాదాలు చేశారు. ఆమెను అక్కడ్నుంచి గెంటుతూ ఆమె వెంటబడ్డారు. దీంతో జోక్యం చేసుకున్న పోలీసులు యువతిని అరెస్టు చేస్తామని కాంగ్రెస్‌ కార్యకర్తలకు నచ్చజెప్పారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అయితే, తాను బీజేపీ కార్యకర్తను కానని, కేవలం మోడీకి సపోర్టర్‌ను మాత్రమేనని ఆమె చెప్పడం వీడియోలో వినిపిస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. మహిళలకు కాంగ్రెస్ పార్టీ నుంచి రక్షణ కావాలంటూ ధ్వజమెత్తారు.