కలకలం: జమ్మూ బస్టాండ్‌లో బాంబు పేలుడు: ఒకరు మృతి, 28 మందికి గాయాలు

bomb blast
- Advertisement -

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రదాడి కలకలం రేగింది. జమ్మూలోని బస్టాండ్‌ దగ్గర ఓ వాహనంలో బాంబు పేలింది. పేలుడుతో ఒక్కసారిగా ప్రయాణికులు భయంతో పరుగులుపెట్టారు. ఏం జరిగిందో తెలియక భయంతో వణికిపోయారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పేలుడు ఘటనలో ఒకరు మృతి చెందగా, 28మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బాంబు పేలుడు తీవ్రతకు పార్కింగ్ లో ఉన్న పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.

ఉగ్రవాదుల దుశ్చర్యేనా?

పేలుడు ఘటనపై సమాచారం అందగానే అక్కడికి చేరుకున్న పోలీసులు, భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. ఇది ఉగ్రవాదుల దుశ్చర్యా లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో అధికారులు విచారణ చేపడుతున్నారు.

బస్టాండ్ వద్ద బస్సు వద్ద గ్రనేడ్‌ దాడి జరిగిందని జమ్మూ ఐజీ నిర్ధారించారు. చైనాలో తయారైన గ్రెనేడ్ వల్ల పేలుడు జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, పుల్వామా ఉగ్రదాడి, ఇండో-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూ బస్టాండ్‌లోని బస్సులో బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు, పోలీసు సిబ్బంది రాష్ట్ర్ర వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మందికిపైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -