ప్రజలెవరూ బయటకు రావొద్దు: గుజరాత్ సీఎం

1 week ago

అహ్మదాబాద్: గుజరాత్‌లో నేడు కొత్తగా మరో 12 కోవిడ్-19 కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్రంలో కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 30కి చేరింది. రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.

నేడు నమోదైన 12 కొత్త కేసుల్లో ఐదుగురు స్థానికులు. కరోనా బాధితుల ద్వారా వీరికి సోకినట్టు అధికారులు తెలిపారు. మిగతా వారు సౌదీ అరేబియా, శ్రీలంక, ఫ్రాన్స్, యూకే వెళ్లొచ్చిన వారని పేర్కొన్నారు.

తాజా కేసులతో అహ్మదాబాద్‌లో కరోనా బాధితుల సంఖ్య 13కు చేరుకోగా, వడోదరలో 6, సూరత్‌లో 5, గాంధీనగర్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. కచ్, రాజ్‌కోట్‌లలో ఒక్కో కేసు నమోదైంది.

కరోనా వైరస్ కారణంగా సూరత్‌లో నిన్న 67 ఏళ్ల వ్యక్తి మరణించాడు. రాష్ట్రంలో ఇదొక్కటే కరోనా మరణం. అయితే, అతడికి కిడ్నీ సమస్యలు, ఆస్తమా తదితర వ్యాధులు కూడా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

తాజా కేసుల నమోదుపై గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించినట్టుగానే ఈ నెల 31 వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

నెలఖారు వరకు రాష్ట్రంలో పాక్షిక లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు చెప్పారు. జనం అనవసరంగా బయటకు రావొద్దని సూచించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ మూడో దశలో ఉందని, చైనా ఐదో దశలో ఉందని పేర్కొన్నారు.

చైనా ప్రస్తుతం కోలుకుంటోందన్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, గాంధీనగర్, కచ్ జిల్లాలు మొత్తాన్ని లాక్‌డౌన్ చేసినట్టు చెప్పారు. పాక్షిక లాక్‌డౌన్‌లో ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయని సీఎం వివరించారు.