షాకింగ్: హార్దిక్ పటేల్‌కు చేదు అనుభవం! ఎన్నికల ప్రచార సభలో.. అందరూ చూస్తుండగా…

1:02 pm, Fri, 19 April 19
hardik-patel

గుజరాత్‌: కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన ఆయన, ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఉన్న వేళ, ఓ వ్యక్తి వేదికపైకి దూసుకొచ్చి హార్దిక్ చెంప చెళ్లుమనిపించాడు.

ఈ ఘటనతో అక్కడున్న వారంతా అవాక్కవగా, కాంగ్రెస్ కార్యకర్తలు సదరు వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటన సురేందర్ నగర్‌లో జరిగింది. ఎన్నికల ప్రచారం నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చిన హార్దిక్.. బీజేపీ పాలనను విమర్శిస్తుండగా.. ఈ హఠాత్పరిణామం చోటుచేసుకుంది. 

చదవండి: గేదెపై ఎన్నికల ప్రచారం! కాంగ్రెస్‌కి ఊహించని షాక్ ఇచ్చిన ఈసీ!

దీంతో హార్దిక్ పటేల్ కూడా తన ప్రసంగాన్ని కాసేపు ఆపివేశారు.  ఆ తరువాత ఆయన తేరుకుని ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ తరహా ఘటనలతో మోడీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని కూలదోయలేరని, ఇలాంటి ఘటనలకు తానేమీ భయపడబోనని, రానున్న ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెసేనని ఆయన వ్యాఖ్యానించారు. 

గురువారం ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్‌లో ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై ఓ వ్యక్తి షూ విసిరిన సంగతి మరిచిపోకముందే హార్దిక్ పటేల్‌పై దాడి జరగడం గమనార్హం.