నా బిడ్డను క్షమించండి.. కోర్టులో కొంగుచాచిన నిర్భయ దోషి తల్లి

11:33 am, Wed, 8 January 20

న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు డెత్ వారెంట్ సందర్భంగా పాటియాలా హౌస్ కోర్టులో నిన్న జరిగిన ఓ ఘటన అందరి మనసులను తడి చేసింది. కోర్టులోకి వచ్చిన దోషి ముకేశ్ తల్లి కన్నీటి పర్యంతమవుతూ నిర్భయ తల్లి వద్దకు వెళ్లారు. ఆ వెంటనే కొంగు చాచి తన కుమారుడికి క్షమాభిక్ష పెట్టాలని వేడుకుంది. అతడిని బతికించాలని వేడుకుంటూ వలవలా ఏడ్చింది.

ఆమె కన్నీళ్లు చూసి నిర్భయ తల్లి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో కొంతసేపటి వరకు కోర్టులో ఉద్విగ్న పరిస్థితులు రాజ్యమేలాయి. అనంతరం నిర్భయ తల్లి బదులిస్తూ.. తనకు ఒక కుమార్తె ఉండేదని, ఆమెకు ఏం జరిగిందో ఎలా మర్చిపోగలనని అన్నారు.

న్యాయం కోసం ఏడేళ్లుగా తాను ఎదురుచూస్తూనే ఉన్నానని పేర్కొన్నారు. దీంతో కల్పించుకున్న న్యాయమూర్తి నిశ్శబ్దం పాటించాలంటూ ఆదేశించారు. అనంతరం బయటకు వచ్చిన ముకేశ్ తల్లి నిరుపేదలమైనందుకే తన కుమారుడిని ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు.