వర్షాలతో అసోం విలవిల.. కొట్టుకుపోయిన జాతీయ రహదారి

7:02 pm, Mon, 25 May 20

దిస్పూర్: ఎంఫాన్  తుఫాన్ ప్రభావంతో ఈశాన్య భారతం విలవిల్లాడుతోంది. జోరు వానలకు బ్రహ్మపుత్ర నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.

అసోంలో గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో వరదలు పోటెత్తుతున్నాయి.

వరదల ధాటికి సోమవారం గోల్పారా జిల్లాలోని అగియా-లఖీంపూర్‌ జాతీయ రహదారి తెగిపోయింది. దీంతో రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి.

దాదాపు వంద మీటర్ల మేర 12వ నంబరు జాతీయ రహదారి కొట్టుకు పోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.

కుండపోత వర్షాలతో బ్రహ్మపుత్ర నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నది. నదీ పరివాహక ప్రాంతంలోని పంటలు, ఆవాసాలు మొత్తం నీట మునిగాయి.

దీంతో వందలాది మంది జనం నిరాశ్రయులయ్యారు. వరదలవల్ల అసోం రాష్ట్రంలోని చెరువులు, కుంటల కట్టలు తెగిపోయాయి.

పలు ప్రాంతాల్లో చిన్నచిన్న రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో వివిధ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

దీంతో లోతట్టు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నిరాశ్రయులైన వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.