లోక్‌సభ ఎన్నికలు 2019: అత్యంత పేద ఎంపీ అభ్యర్థి ఇతడే!

10:58 am, Tue, 2 April 19
Poorest Lok Sabha Candidate News, Latest Lok sabha Election News, Newsxpressonline

లక్నో: కొద్ది రోజుల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ధనవంతుల జాబితా పెద్దగానే ఉంది. అలాగే బరిలో నిలిచిన వారిలో అతి తక్కువ మంది మధ్యతరగతి వారున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న ఓ పేద వ్యక్తి.. ధనవంతులైన వారితో పోటీ పడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రతిసారి జరిగే ఎన్నికల్లోనూ అతడే పేదవాడిగా ఉండటం గమనార్హం. 

చదవండి: నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు.. వారికి మాత్రం వేయకండి!

ఆ వివరాల్లోకి వెళితే..ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నవారిలో అత్యంత పేద వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ నుంచి బరిలోకి దిగిన మంగెరామ్ కశ్యప్. వృత్తిరీత్యా న్యాయవాది. 51 ఏళ్ల కశ్యప్.. 2000వ సంవత్సరంలో ‘మజ్దూర్ కిసాన్ యూనియన్ పార్టీ’ని స్థాపించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతీ ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేస్తున్నారు. ఈ పార్టీలో వెయ్యిమంది సభ్యులున్నారు.

బ్యాంకులోనూ, చేతిలోనూ నగదు లేదు..

తాజా ఎన్నికల్లోనూ బరిలోకి దిగిన ఆయన నామినేషన్ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ చర్చనీయాంశమైంది. తన వద్ద నగదు లేదని, బ్యాంకులో కూడా సొమ్ము లేదని పేర్కొన్నారు. తన భార్య వద్ద కూడా నగదు లేదని, ఆమె బ్యాంకు ఖాతాలోనూ సొమ్ము లేదని పేర్కొన్నాడు.

అయితే, తమకు ఓ చిన్న ఫ్లాట్ ఉందని, రూ.15 లక్షల విలువల చేసే చిన్న ఇల్లు కూడా ఉందని పేర్కొన్నారు. అది కూడా తన స్వార్జితం కాదని, తన అత్తింటివారు బహుమానంగా ఇచ్చారని వెల్లడించారు. అలాగే, 36 వేల విలువ చేసే బైక్ కూడా ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

పాదయాత్రతోనే మంగేరామ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండటం గమనార్హం. ఇతర పార్టీలు ప్రచారం కోసం పెట్టే ఖర్చును ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తే బాగుంటుందని మంగేరామ్ అభిప్రాయపడ్డారు. తనకు ఇద్దరు పిల్లలు అని, తన భార్య గృహిణి అని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలవాలనే తాను మళ్లీ మళ్లీ పోటీ చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ప్రతీ ఎన్నికల సమయంలోనూ నాయకుల ఆస్తులు రెట్టింపు అవుతుండగా, కశ్యప్ మాత్రం మరింత పేదవాడిగా మారుతుండడం గమనార్హం.

చదవండిచంద్రబాబుపై విమర్శలు చేసిన వైఎస్ భారతి: సింహాద్రిపురంలో ప్రచారం