సీతారాం ఏచూరి పేరు మార్చుకుంటే మంచిదేమో: శివసేన

9:16 pm, Fri, 3 May 19

ముంబై: రామాయణ, మహాభారతాలు మొత్తం హింసతో నిండి ఉన్నాయని ఇటీవల సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీతారాం చేసిన వ్యాఖ్యలపై శివసేన ఘాటుగా స్పందించింది.

రామాయణం, మహాభారతాలను హిందూ హింసగా పేర్కొన్న సీతారాం ఏచూరి ఆయన పేరులో నుంచి సీతారాంను తీసేయాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సూచించారు. హిందువులు హింసాత్మకంగా ఉంటారనడంలో ఆయన ఉద్దేశం ఏంటి? అని ప్రశ్నించారు.

అలాగే రామాయణం, మహాభారతాలు ఒకటే సందేశాన్ని ఇస్తున్నాయని, ఎప్పటికైనా చెడు మీద మంచి గెలుస్తుందనేదే దాని సందేశమని అన్నారు. రాముడు, కృష్ణుడు, అర్జునుడు అంతా సత్యానికి సంకేతాలని, రామాయణ, మహాభారతాల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు.. రేపు పాకిస్తాన్ మీద భారత సైనికుల పోరాటం కూడా హింసాత్మకం అంటారని తెలిపారు.

అసలు సీతారాం ఏచూరిది సొంత సిద్ధాంతమని,  హిందువులను ఎటాక్ చేయడమే ఆయన విధానమని మండిపడ్డారు. ఏది ఏమైనా సీతారాం ఏచూరి ఆయన పేరులో నుంచి సీతారాంను తీసేయాలని సూచించారు. అలాగే, సీపీఎం అభ్యర్థి కన్హయ్య కుమార్ పేరు కూడా మార్చుకోవాలని కోరారు.

చదవండి:మేమూ సర్జికల్ స్ట్రైక్స్ చేశాం…మీలా ఛాతీ చరుచుకోలేదు: బీజేపీకి కాంగ్రెస్ కౌంటర్