పాక్ యుద్ధ విమానాలను పరుగులెత్తించిన ధీర వనిత! ఆరోజు ఏం జరిగిందంటే…

iaf-woman-ground-controller-played-a-key-role
- Advertisement -

దేశం: పాకిస్తాన్
తేదీ: 27 ఫిబ్రవరి 2019
సమయం: ఉదయం 8.45 గంటలు

ఆ సమయంలో పాకిస్తాన్ తన పౌర, వాణిజ్య విమానాల రాకపోకలను నిలిపివేసింది. దీంతో ఆ దేశం భారత్‌పై ప్రతీకార దాడి చేసే అవకాశాలున్నట్లు అనుమానాలు తలెత్తాయి.

- Advertisement -

అయితే దీనిని ముందుగా పసిగట్టింది భారత వాయుసేనకు చెందిన ఓ యువ మహిళా స్క్వాడ్రన్‌ లీడర్. గ్రౌండ్ కంట్రోల్‌లో విధి నిర్వహణలో అప్రమత్తత, తెగువ ప్రదర్శించిన ఆమె వాయుసేన ఉన్నతాధికారుల ప్రశంసలు పొందింది. ఆమె సేవలకు మెచ్చి ఆమె పేరును విశిష్ఠ సేవాపతకానికి ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం.

అసలేం జరిగిందంటే…

పాకిస్తాన్ బాలకోట్‌లోని ఉగ్రవాద శిక్షణ స్థావరాలపై భారత వాయుసేన ఫిబ్రవరి 26, 2019న చేసిన ఎయిర్ స్ట్రయిక్ తర్వాత పాకిస్తాన్‌లోని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం దేశీయంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది.

భారత్ ఎయిర్ స్ట్రయిక్ చేస్తోంటే పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ చేష్టలుడిగి ఎందుకు చూస్తుండిపోయిందంటూ ప్రతిపక్ష నేతలు మొదలుకొని సాధారణ పౌరులకు వరకు ఇమ్రాన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. దీంతో తాము కూడా తక్కువేం తినలేదని నిరూపించడం కోసం ఏదైనా చేయాలని ప్రభుత్వం భావించింది.

ఆ మర్నాడే.. 27 ఫిబ్రవరి 2019న.. పాక్ ప్రధాన మంత్రిత్వ కార్యాలయం నుంచి పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్‌కు ఆదేశాలు అందాయి. దీంతో పాక్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మొత్తం 25 యుద్ధ విమానాలు ఆ దేశంలోని వివిధ ప్రదేశాల నుంచి గాల్లోకి లేచాయి. వీటిలో ఎఫ్‌-16, జెఎఫ్‌-17ఎస్‌ విమానాలు ఉన్నాయి. 

పసిగట్టిన ఐఏఎఫ్ మహిళా స్క్వాడ్రన్‌ లీడర్‌…

అయితే ఈ విషయాన్ని పంజాబ్‌లోని భారత వాయుసేనకు చెందిన రాడార్ కంట్రోల్ స్టేషన్‌లో విధుల్లో ఉన్న ఓ యువ మహిళా స్క్వాడ్రన్‌ లీడర్‌ పసిగట్టింది. శత్రుదేశం ఏదో చేయబోతోందని ఆమె ఆందోళన చెందింది. వెంటనే పిర్‌ పంజాల్‌ ప్రాంతంలో ఉన్న రెండు మిరేజ్‌ 2000, రెండు సుఖోయ్‌ ఎస్‌యూ 30 ఎంకేఐ యుద్ధ విమానాల పైలట్లకు సమాచారం చేరవేసింది.

ఈలోగానే పాకిస్తాన్‌కు చెందిన యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి ప్రవేశించాయి. వాటి కదలికలను రాడార్ ద్వారా ఈ మహిళా స్క్వాడ్రన్‌ లీడర్‌ గమనిస్తూ.. ఎప్పటికప్పుడు భారత యుద్ధవిమానాల పైలట్లకు చేరవేసింది.

మిగ్‌-21 బైసన్స్‌కు సమాచారం…

అయితే పాకిస్తాన్‌వి 25 యుద్ధ విమానాలు. మన యుద్ధ విమానాలేమో తక్కువ సంఖ్యలో ఉన్నాయి. వాటిని ఎదుర్కోవడం ఎలా? ఆలోచించడానికి, ప్రణాళికలు రచించుకోడానికి సమయం లేదు. దీంతో ఆ మహిళా స్క్వాడ్రన్‌ లీడర్‌ శ్రీనగర్‌లోని మిగ్‌-21 బైసన్స్‌కు సమాచారం అందించింది.

అంతే.. భారత్‌కు చెందిన రెండు మిగ్-21 యుద్ధ విమానాలు క్షణాల వ్యవధిలో గాల్లోకి లేచాయి. అయితే వీటి రాకను పాకిస్తాన్ పైలట్లు పసిగట్టలేకపోయారు. ఊహించని విధంగా మిగ్‌-21 యుద్ధ విమానాలు ప్రత్యక్ష్యం అయ్యేసరికి పాకిస్థాన్‌ పైలట్లు కంగారుపడ్డారు. ఇక లాభం లేదనుకుని.. వెనక్కి మళ్లారు.

iaf-mig-21-pilot-abhinandan-vardhamanవెంటాడిన అభినందన్ వర్ధమాన్…

అయినా మన మిగ్-21 యుద్ధ విమానాల పైలట్లు వదిలిపెట్టలేదు. వచ్చినంత వేగంగా సరిహద్దు దాటి పాకిస్తాన్‌వైపు వెళుతోన్న వారి యుద్ధ విమానాలను వెంబడిస్తూ వెంటాడారు. వాటిలో ఒక మిగ్-21 యుద్ధ విమానాన్ని నడుపుతోంది పైలట్‌, వింగ్ కమాండర్ అభినందన్‌ వర్థమాన్‌.

హెచ్చరించింది, కానీ అప్పటికే…

ఎలాగైనా పాక్ విమానాలను ఫిక్స్ చేయాలనే ఆలోచనతో అతడు అప్పటికే సరిహద్దు నియంత్రణ రేఖను కూడా దాటేశాడు.
ఈ విషయాన్ని కూడా ఈ మహిళా స్క్వాడ్రన్‌ లీడర్ గమనించింది.

వెంటనే ‘టర్న్‌ కోల్డ్‌.. టర్న్‌ కోల్డ్‌’అంటూ హెచ్చరించింది. కానీ ఫలితం లేకుండాపోయింది. ఎందుకంటే, అప్పటికే పాకిస్తాన్.. మన రేడియో ఫ్రీక్వెన్సీని జామ్‌ చేసింది. దీంతో అభినందన్ వర్ధమాన్ ఈ మహిళా స్క్వాడ్రన్‌ లీడర్ హెచ్చరికలను వినలేకపోయాడు.

ఆ తరువాత పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ అభినందన్ నడుపుతోన్న యుద్ధ విమానాన్ని ఫిక్స్ చేసి పేల్చేయడం, గత్యంతరం లేక అతడు పారాచూట్ సాయంతో బయటపడడం అదంతా తెలిసిన సంగతే.

విశిష్ఠ సేవాపతకానికి ఎంపిక…

కానీ ఆ రోజున.. ఆ యువ మహిళా స్క్వాడ్రన్‌ లీడర్ అప్రమత్తత, ఆమె చూపిన తెగువ ప్రశంసనీయం. అందుకే ఆమె సేవలకు మెచ్చి ఆమె పేరును విశిష్ఠ సేవాపతకం పురస్కారానికి ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం. ఈ పురస్కారానికి ఆమె పేరును ప్రతిపాదించబోతున్నట్లు వాయుసేన ఉన్నతాధికారులు ఓ మీడియాకు వెల్లడించారు.

అయితే సదరు యువ మహిళా స్క్వాడ్రన్‌ లీడర్‌ ఎవరన్నది వారు చెప్పలేదు. భద్రత కారణాల దృష్ట్యా ఈ ధీరవనిత పేరును వారు బయటకు వెల్లడించడం లేదని తెలుస్తోంది. ఏదేమైనా ఆ రోజన ఆ మహిళా అధికారి తన విధి నిర్వహణలో చూపిన తెగువ దేశంలోని మహిళలందరికీ ఆదర్శనీయం!

- Advertisement -