నేను మాస్క్ పెట్టుకోలేదు ఫైన్ వేయండి: అధికారిని ఆదేశించిన ఐజీ

6:50 pm, Sun, 7 June 20

కాన్‌పూర్: కరోనా కాలంలో ప్రజలు సరైన నిబంధనలు పాటించకుంటే పోలీసులు ఏం చేస్తారు..? కేసు పెట్టి, ఫైన్ వేస్తారు.

అయితే పోలీసు అధికారే స్వయంగా నిబంధనలు అతిక్రమిస్తే..? అతడిని ఎవరేం చేస్తారు, పోలీసు కదా అనుకుంటున్నారా..

అయితే మీ ఆలోచన తప్పు. ఎవరో కాదు స్వయంగా తనకు తానే ఫైన్ వేసుకున్నారు ఓ పోలీసు అధికారి. వివరాల్లోకి వెళితే..

కాన్‌పూర్‌లో మోహిత్ అగర్వాల్ అనే పోలీసు అధికారి ఇన్స్‌పెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు.

విధుల్లో భాగంగా స్థానిక బర్రా అనే ప్రాంతానికి శుక్రవారం ఆయన వెళ్లారు. జీపు నుంచి దిగిన తర్వాత కొన్ని సెకండ్ల పాటు ఆయన మాస్కు పెట్టుకోవడం మర్చిపోయారు.

వెంటనే గుర్తుకొచ్చి మాస్క్ తీసుకుని పెట్టుకున్నారు. అయితే బహిరంగ ప్రాంతంలో మాస్క్ పెట్టుకోకుండా కొన్ని సెంకండ్లు ఉన్నందుకు తనకు తానే రూ.100 ఫైన్ వేసుకున్నారు.

దీనికోసం స్థానిక స్టేషన్ ఆఫీసర్ రంజీత్ సింగ్‌ను పిలిచి మాస్క్ పెట్టుకోకుండా బహిరంగ ప్రాంతంలో పర్యటించినందుకు తనపై ఫైన్ వేయమని ఆదేశించారు.

దీంతో రంజిత్ సింగ్ రూ.100 చలానా రాశారు. వెంటనే ఆ మోత్తాన్ని ఐజీ మోహిత్ అగర్వాల్ కట్టేశారు.

నిబంధనలు అందరికా ఒకేలా ఉంటాయని ఈ చర్యతో ఐజీ చెప్పకనే చెప్పారు. స్థానికులంతా ఆయనను అభినందించారు.