న్యూఢిల్లీ: ఒకసారి కరోనా వచ్చి వెళ్లిపోయిన వారికి మళ్లీ కరోనా సోకదనే గ్యారెంటీ ఏమీ లేదని, తగిన జాగ్రత్తలు పాటించకపోతే కరోనా మళ్లీ మళ్లీ సోకే ప్రమాదం ఉందని దేశంలోనే తొలి కరోనా వైరాలజిస్ట్ డాక్టర్ పవిత్రా రాజగోపాలన్ తెలిపారు.
అంతేకాదు, కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు కరోనా వైరస్ సోకకుండా ఫేస్ మాస్కు, ఫేస్ షీల్డు ధరించడమే శ్రేయస్కరం అని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే ఇలాంటి కేసులు హాంకాంగ్‌లో ఒకటి, అమెరికాలో తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చాయని డాక్టర్ పవిత్ర తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. తమకు కరోనా రెండోసారి వచ్చినట్లుగా చాలామందికి తెలియకపోవడం అని కరోనా వైరస్‌పై పరిశోధన చేసి అమెరికాలోని అరిజోనా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందిన ఆమె పేర్కొన్నారు.
కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి శరీరంలో ఏర్పడే యాంటీబాడీస్ 6 నుంచి 8 వారాలు మాత్రమే ఉంటాయని, ఆ తరువాత అవి కనుమరుగైపోవడంగాని, లేదంటే వాటి శక్తి తగ్గిపోవడంగాని జరుగుతుందన్నారు.
నిజానికి కరోనా వైరస్ బారిన పడిన వారిని 14 నుంచి 21 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉంచుతారు. ఆ సమయంలో వారి శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగేందుకు అవసరమయ్యే ఇతర అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని పేర్కొన్నారు.
దీనివల్ల వారి శరీరం కొంత శక్తిని పుంచుకుని కరోనా వైరస్ దాడిని ఎదుర్కొంటుందని, అయితే పోస్ట్ ఐసోలేషన్‌లో మళ్లీ అజాగ్రత్తగా ఉంటే రోగనిరోధక శక్తి సన్నగిల్లుతుందని, ఇదే కరోనాకు అనుకూలంగా మారుతుందన్నారు.
చాలామంది ఒకసారి కరోనా వచ్చి తగ్గిపోతే ఇక మళ్లీ రాదనే భావనలో ఉంటారని, కానీ అది నిజం కాదని, వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఫేస్ మాస్కు, ఫేస్ షీల్డు ధరిస్తూనే ఉండాలని డాక్టర్ పవిత్ర సూచించారు.
ఎన్-95 లేదా ఎన్-98 మాస్కులే ధరించాలన్న నియమం ఏమీ లేదని, సాధారణ ప్రజానీకం వస్త్రంతో చేసిన మాస్కు అయినా ధరించవచ్చని తెలిపారు.
కాకపోతే నాలుగైదు మాస్కులు దగ్గర ఉంచుకుని ప్రతి నాలుగైదు గంటలకు ఒకసారి వాటిని మార్చుకుంటూ ఉండాలని, దీంతోపాటు చేతులను తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలని వివరించారు.
అలాగే రోగనిరోధక శక్తిని కోల్పోకుండా ఉండేందుకు బలమైన ఆహారం తీసుకుంటూనే ఉండాలని, వ్యాయామం, మంచి నిద్ర, ఒత్తిడికి దూరంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు.