మగాళ్లకెంత కష్టం.. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో పురుషులే ఎక్కువట!

2 weeks ago

న్యూఢిల్లీ: దేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో పురుషులే అత్యధికమని జాతీయ నేర గణాంక బ్యూరో (ఎస్‌సీఆర్‌బీ) వెల్లడించిన గణాంకాలను బట్టి తెలుస్తోంది.

2019లో సగటున రోజుకు 381 మంది చేసుకుంటున్నారు. కారణాలు ఏవైనా వీరిలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది.

గతేడాది 1,39,123 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2018లో 1,34,516 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక, ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో 70.2 శాతం మంది పురుషులు ఉండగా, మహిళల శాతం 29.8 శాతం.

వివాహం తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో పురుషుల సంఖ్యే అధికమని ఎన్‌సీఆర్‌బీ పేర్కొంది.

వివాహం తర్వాత 68.4 శాతం మంది పురుషులు ఆత్మహత్యలకు పాల్పడగా, 62.5 శాతం మంది మహిళలు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.

గ్రామాలతో పోలిస్తే నగరాల్లోనే ఆత్మహత్యలు రేటు ఎక్కువగా ఉందని ఎస్‌సీఆర్‌బీ పేర్కొంది. ఇక, ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 53.6 శాతం ఉరివేసుకోగా, 25.8 శాతం మంది విషం తీసుకుని, 5.2 శాతం శాతం మంది నీళ్లలో మునిగి, 3.8 శాతం నిప్పంటించుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు.

కుటుంబ సమస్యల కారణంగా 32.4 శాతం మంది, వివాహ సంబంధిత సమస్యల కారణంగా 5.4 శాతం మంది, అనారోగ్య కారణాల వల్ల 17.5 శాతం మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.