భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు.. హై అలర్ట్! చైనాపై అమెరికా చెడుగుడు…

10:11 pm, Thu, 21 May 20

న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య వివాదాస్పద సరిహద్దులో పెరుగుతున్న ఉద్రికత్తలకు చెక్ పెట్టేందుకు ఇరు దేశాల మిలటరీ మధ్య జరిగిన చర్చలు ప్రతిష్టంభనతో ముగిశాయి.

సరిహద్దు సంఘటనలు 2015 నుంచి అత్యధికంగా ఉన్నాయని భారత సీనియర్ భద్రతాధికారులు తెలిపారు. అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ఉద్దేశంతో మంగళవారం ఇరు వర్గాలు చర్చలు జరిపాయి.

అయితే ఏ ఆర్మీ కూడా రాజీకి ఇష్టపడలేదని పేరు చెప్పడానికి అంగీకరించని అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాల సైన్యం హై అలర్ట్‌గా ఉంది.

భారత్-చైనా మధ్య 3,488 కిలోమీటర్ల మేర గుర్తించని సరిహద్దు ఉంది. సరిహద్దు వద్దకు ఇరు దేశాల దళాలను తరలించినట్టు అధికారులు తెలిపారు.

1962 భారత్-చైనా యుద్ధ ప్రారంభ సమయంలో వివాదానికి కారణాల్లో ఒకటైన గాల్వన్ నది వద్ద, టిబెటన్ పీఠభూమిలో 14 వేల అడుగుల ఎత్తులో ప్యాంగాంగ్ త్సో హిమానీ సరస్సు వద్ద ఒకరి నొకరు ఎదుర్కొంటున్నారు.

చైనాను ఆడేసుకున్న అమెరికా…

ఈ ప్రదేశాలు తమవేనని ఇరు దేశాలు వాదిస్తున్నాయి.  మరోవైపు, భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించి చైనాపై అమెరికా పదునైన విమర్శలు గుప్పించింది. సరిహద్దుల్లో చైనా చర్యలను విపరీత ప్రవర్తనగా అభివర్ణించింది.

దక్షిణ చైనా సముద్రంలోనూ తన ఆధిపత్యం చలాయించే ప్రయత్నంలో చైనా వ్యవహారశైలి ప్రమాదకారిగా మారిందని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి అలీస్ వెల్స్ వ్యాఖ్యానించారు.

దక్షిణ చైనా సముద్రం, భారత సరిహద్దుల్లోనూ తన ఆధిపత్యాన్ని చలాయించడానికి చైనా రెచ్చగొట్టే ప్రయత్నాలను చూస్తునే ఉన్నామని, తన శక్తిని ఎలా ఉపయోగించుకోవాలనే వైఖరితోనే ఇలా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.