గాల్వన్ లోయ ఘటన: కాల్పులు జరగలేదు.. రాళ్లు, కర్రలతోనే సైనికులు బాహాబాహీ: వీపీ మాలిక్

3:43 pm, Sun, 21 June 20
Indian Army Ex-Chief General VP Malik speaks on India-China faceoff at Galwan Valley

న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దు లద్దాఖ్ వద్ద గాల్వన్ లోయలో ఇరుదేశాల సైనికులు ఘర్షణ పడ్డ ఘటనలో అసలు కాల్పులే జరగలేదని, రెండు దేశాల సైనికులు రాళ్లతో, కర్రలతో కొట్టుకోవడం వల్ల సైనికులు గాయపడి ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.

ఇరు దేశాల సైనికులు సుదీర్ఘ సమయం బాహాబాహీకి దిగారని, ముష్ఠియుద్ధం కారణంగానే వారు తీవ్రంగా గాయపడ్డారని చెబుతున్నారు. 

ఈ ఘటనపై భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీపీ మాలిక్ మాట్లాడుతూ.. భారత్-చైనా సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మరింత తీవ్రం అవొచ్చని అభిప్రాయపడ్డారు. 

‘‘ప్రస్తుతం భారత్-చైనా సరిహద్దుల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇరు పక్షాల సైనికుల మరణం మరిన్ని ఉద్రిక్తతలకు దారితీయొచ్చు.. ఎందుకంటే, బలగాలు ఇప్పుడు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతుంటాయి..’’ అని తెలిపారు.

ఈ సమస్యకు సైనిక పరిష్కారం సాధ్యం కాదని మాలిక్ అభిప్రయపడ్డారు. ఈ విషయాన్ని తాను గతంలోనూ చెప్పానన్నారు. ఇప్పుడు దౌత్యం ద్వారానే ఉద్రిక్తతలు సద్దుమణిగేలా చేయాలని, దీనికి రెండు దేశాల నాయకత్వం చొరవ చూపాలని సూచించారు. 

‘‘బాహాబాహీకి కూడా అనుమతించరాదు..’’

రెండు దేశాల సైనికులు బాహాబాహీకి దిగడాన్ని కూడా భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీపీ మాలిక్ తప్పుబట్టారు. మనవైపు నుంచి కూడా కొన్ని తప్పులు జరుగుతున్నాయన్నారు. 

ముఖ్యంగా బాహాబాహీకి అనుమతించకూడదని చెప్పారు. గత నాలుగేళ్లలో సరిహద్దుల్లో పలు ప్రాంతాల్లో ఇలాంటి బాహాబాహీలు జరిగాయని పేర్కొన్నారు. బలగాలు శత్రుదేశం సరిహద్దు పోస్టుకు సమీపంలో వెళుతున్నప్పుడు తెల్లజెండా ఎగరవేస్తూ వెళ్లాలన్నారు. 

1967లో కూడా ఇలా బాహాబాహీకి అనుమతిస్తే.. అది పెద్ద ఘర్షణగా మారిందని, చివరికి నాలుగైదు రోజులపాటు రెండు దేశాల బలగాలు కాల్పులు జరుపుకునే వరకు పరిస్థితి వెళ్లిందని మాలిక్ గుర్తు చేశారు. 

‘‘నిరాయుధ ఒప్పందం ఉన్నప్పటికీ..’’

నిజానికి గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికులు ఆయుధాలు చేతబట్టడానికి వీల్లేదనే ఒప్పందం ఉందని పేర్కొన్న మాలిక్ తనకు అందిన సమాచారం ప్రకారం చైనా సైనికులు రాళ్లు, కర్ర గదలు తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. 

భారత గస్తీ బలగాలు మాత్రం నిరాయుధంగా వెళ్లాయని, ఇరు దేశాల బలగాల నడుమ మాటామాటా పెరిగి అది కాస్తా చినికి చినికి గాలివానలా మారినట్లు పెద్ద గొడవగా మారి చివరికి ప్రాణాంతకంగా మారిందని చెప్పారు. 

‘‘చివరికి ఇరువైపులా ప్రాణ నష్టం జరిగింది. ఇది తప్పే.. రెండు పక్షాలు తప్పులు చేస్తున్నాయి.. ఇలాంటి తప్పులు జరగకూడా చూడాల్సిన బాధ్యత రెండు దేశాల సైనికాధికారులపై ఉంది..’’ అని మాలిక్ వ్యాఖ్యానించారు. 

‘‘రెండు వైపులా సైనిక నష్టం జరిగింది.. కానీ, భారత్ బయటికి చెబుతోంది, చైనా మాత్రం ఇంతవరకు ఈ విషయంలో నిజాలను వెల్లడించలేదు. అంతేకాదు, సరిహద్దుల్లో ఇప్పుడు భారత్ మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే, వాస్తవాధీన రేఖ వెంబడి చైనా భారీగా సైన్యాన్ని పెంచే అవకాశం ఉంది..’’ అని మాలిక్ పేర్కొన్నారు. 

చదవండి: