భారతీయ రైల్వే మరో ముందడుగు.. దేశంలోనే తొలిసారిగా ‘ఇంజిన్ లేని రైలు’.. ట్రయల్ రన్ షురూ!

engineless-train-2
- Advertisement -

engineless-train-1

చెన్నై: భారతీయ రైల్వే మరో అడుగు ముందుకేసింది. దేశంలోనే తొలిసారిగా ‘ఇంజిన్ లెస్’ రైలు సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘ట్రైన్ 18’గా పిలిచే ఈ రైలు ఇంజిన్‌తో పనిలేకుండా కేవలం కోచ్‌లతో మాత్రమే నడుస్తుంది. గంటకు సుమారు 160 కిమీల వేగంతో దూసుకెళ్తుంది. ఈ రైలుకు సంబంధించి ట్రయల్ రన్ సోమవారం చెన్నైలో నిర్వహించారు.

- Advertisement -

ప్రస్తుతం దేశంలో అత్యంత వేగవంతమైన రైలు ఢిల్లీ-భూపాల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్. ఇది గంటకు సుమారు 150 నుంచి 155 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ వేగాన్ని తట్టుకోగలిగే సామర్థ్యం కేవలం ఢిల్లీ-భుపాల్ మధ్య రైలు ట్రాక్‌లకే ఉంది. దీంతో ఇంజిన్ లెస్ రైలు.. ‘ట్రైన్ 18’ను ముందుగా ఈ మార్గంలోనే నడపాలని నిర్ణయించారు.

మెట్రో రైలు తరహాలో…

చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్)‌లో దేశీయ పరిజ్ఞానంతో ఈ రైలును తయారు చేశారు. ఈ రైలుకు ప్రత్యేకంగా లోకోమోటివ్ ఇంజిన్ ఉండదు. మెట్రో రైలు తరహాలో కేవలం లోకోపైలట్ క్యాబిన్ మాత్రమే ఉంటుంది. రెండు ఎగ్జిక్యూటివ్‌ కోచ్‌లతో కలిపి మొత్తం 16 ఏసీ బోగీలు ఉంటాయి. వీటిలో మొత్తం 78 సీట్లు ఉంటాయి. 360 డిగ్రీల కోణంలో తిరగడం ఈ సీట్ల ప్రత్యేకత.

రూ.100 కోట్ల వ్యయంతో నిర్మితమైన ‘ట్రైన్ 18’ లోకోపైలట్ క్యాబిన్‌లో వైఫై సదుపాయం, ఎల్ఈడీ స్క్రీన్లు ఉంటాయి. కోచ్‌లకు ఆటోమేటిక్ స్లైడ్ డోర్లు ఉంటాయి. కేవలం ప్లాట్‌ఫాంలు వచ్చినప్పుడు మాత్రమే ఇవి తెరుచుకుంటాయి. ఇంకా ఈ రైలులో అధునాతన టాయిలెట్లతోపాటు మరిన్ని హంగులు ఉంటాయి.

విజయవంతమైతే మిగతా ప్రాంతాల్లో…

ఈ ఇంజిన్ లెస్ రైలు గనుక విజయవంతమైతే మిగతా ప్రాంతాల్లో సైతం ‘ట్రైన్ 18’ రైళ్లను ఇంటర్ సిటీ రైళ్లుగా నడపాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నెల 7న ఈ రైలు ఢిల్లీకి చేరుకోనుంది. అక్కడ నుంచి మొరాదాబాద్‌-బరేలి స్టేషన్ల మధ్య మళ్లీ ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తారు.
అనంతరం కోటా-సవాయ్‌ మాధోపూర్‌ ప్రాంతంలో మరో ట్రయిల్ వేస్తారు.  దీన్ని హౌరా-ఢిల్లీ మధ్య నడపాలనే యోచనలో కూడా కేంద్రం ఉంది.

- Advertisement -