భారత్‌లోనూ క్రియాశీలక అగ్నిపర్వతం! ఎప్పుడైనా విస్ఫోటనం, పేలితే మాత్రం…

andaman nicobar volcano
- Advertisement -

అండమాన్ అండ్ నికోబార్: అగ్నిపర్వతాలు బద్దలవడం, దానికారణంగా సునామీ సంభవించడం కేవలం ఇండోనేషియాకు, లేదా ఇతర దేశాలకు పరిమితం అనుకుంటున్నారా? కానే కాదు, ఇది మన దేశంలోనూ సంభవించవచ్చు. అవును, మన దేశంలోనూ ఒక క్రియాశీలక అగ్నిపర్వతం ఉంది. ప్రస్తుతం దీన్నుంచి పొగ, ధూళి, అప్పుడప్పుడు లావా బయటికి వస్తున్నాయి.

- Advertisement -

ఇది ఎప్పుడైనా బద్ధలు అయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేగనుక జరిగితే సునామీ కూడా తప్పదని, తీవ్ర ప్రాణనష్టం వాటిల్లవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.

ఎక్కడుందంటే…

ఇంతకీ ఈ క్రియాశీల అగ్నిపర్వతం మన దేశంలో ఎక్కడుందో తెలుసా? కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో. అవును, ఈ దీవుల్లోనే బారెన్ ఐలాండ్ అని ఒకటుంది. ఈ బారెన్ ఐలాండ్‌లోనే ప్రస్తుతం మనం చెప్పుకుంటోన్న క్రియాశీలక అగ్నిపర్వతం ఉంది.

దాదాపు 177 ఏళ్లపాటు నిద్రాణ స్థితిలో ఉన్న ఈ అగ్నిపర్వతం 1991లో ఒకసారి పేలింది. ఆ తరువాత 1994, 1995 సంవత్సరాల్లోనూ నిప్పులు కక్కింది. ఇక ఆ తరువాత నుంచి అప్పుడప్పుడు స్వల్పస్థాయి పేలుళ్లు సంభవిస్తున్నాయి. తాజాగా 2017 జనవరిలోనూ ఈ బారెన్ అగ్నిపర్వతం నుంచి పొగలు, లావా వెలువడ్డాయి.

పోర్ట్ బ్లెయిర్ నుంచి ఈశాన్యం వైపు…

అండమాన్ నికోబార్ దీవుల రాజధాని అయిన పోర్ట్ బ్లెయిర్ నుంచి ఈశాన్యం దిక్కుగా 139 కిలోమీటర్ల దూరంలో బారెన్ ఐలాండ్ ఉంది. దాదాపు 3 కిలోమీటర్ల వ్యాసం కలిగి ఉన్న ఈ బారెన్ ఐలాండ్‌లో సముద్ర తీర ప్రాంతం నుంచి అర కిలోమీటర్ దూరంలో ఈ భారీ అగ్నిపర్వత ముఖద్వారం ఉంది.

ఈ అగ్నిపర్వతం నుంచి పగటిపూట బూడిద వెలువడుతున్నట్లు మాత్రమే కనిపించిందని, సూర్యుడు అస్తమించిన తర్వాత ఎర్రని నిప్పులాంటి లావా ఉబికివచ్చి దిగువకు ప్రవహిస్తున్నట్లు గుర్తించామని అప్పట్లో శాస్త్రవేత్తలు వివరించారు. 5 నుంచి 10 నిమిషాలపాటు అప్పుడప్పుడూ ఇలా లావా వెలువడుతోందని వారు గుర్తించారు.

‘అనక్ క్రకటోవా’ అగ్నిపర్వతం పేలినప్పుడు ఏం జరిగింది?

1018 డిసెంబర్ నెలలో ఇండోనేషియాలో ‘అనక్ క్రకటోవా’ అనే అగ్నిపర్వతం పేలడం, దాని ధాటికి సునామీ సంభవించి తీవ్ర ప్రాణనష్టం వాటిల్లడం తెలిసిందే. నిజానికి అనక్ క్రకటోవా అనేది ఒక పిల్ల అగ్నిపర్వతం. దీని తల్లి ఒకటుంది. దాని పేరు ‘క్రకటోవా’.

1883లో ఈ తల్లి అగ్నిపర్వతం బద్ధలైనప్పుడు కూడా సునామీ సంభవించింది. అప్పట్లో 36 వేల మంది బలయ్యారు. ఆ తరువాత ఈ క్రకటోవా అగ్నిపర్వతం సముద్రంలో దాదాపుగా కనుమరుగైపోయింది.

ఆ తరువాత 1927లో ఉద్భవించిన పిల్ల అగ్నిపర్వతం ‘అనక్ క్రకటోవా’ గత 90 ఏళ్లుగా క్రియాశీలకంగా ఉంటూ డిసెంబర్ 22న బద్ధలైంది. ఫలితంగా అక్కడి సండా స్ట్రెయిట్ ప్రాంతాన్ని సునామీ ముంచెత్తింది.

ఈ ఉపద్రవంలో దాదాపు 500 మంది మరణించగా, మరో 1000 మంది తీవ్రంగా గాయపడ్డారు. వందలాది భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రముఖ పర్యాటక జిల్లా అయిన పాండెగ్లాంగ్‌లో వంద మందికి పైగా మృతి చెందగా.. సెరాంగ్, దక్షిణ లాంపంగ్, టంగ్గమస్, సుమత్రా జిల్లాల్లో కూడా చాలామంది మృతి చెందారు.

అగ్నిపర్వతాలు బద్ధలైతే సునామీ తప్పదా?

అగ్నిపర్వతాలు బద్ధలైనప్పుడు కచ్చితంగా సునామీ వస్తుందా? అంటే, అవుననే అంటున్నారు జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు. మొన్నామధ్యన ఇండోనేషియాలో సునామీ రావడానికి ప్రధాన కారణం అక్కడి అనక్ క్రకటోవా అగ్నిపర్వతం బద్ధలవడమేనని వారు పేర్కొంటున్నారు.

వందేళ్ల క్రితమే వెలుగులోనికి వచ్చిన ఈ అగ్నిపర్వతం గురించి స్థానికులకు తెలుసు కానీ.. దానివల్ల ఏదో ఒకరోజు సునామీ వస్తుందని మాత్రం ఊహించలేకపోయారు. నిజానికి స్థానికులకే కాదు, అక్కడి అధికారులకు కూడా ఈ విషయం తెలియదు.

సముద్ర గర్భంలోని భూమి పొరల్లో చోటుచేసుకునే అలజడి వల్ల సంభవించే సునామీని ముందుగా గుర్తించే సాంకేతిక వ్యవస్థలు అందుబాటులో ఉన్నప్పటికీ.. అగ్నిపర్వతం పేలుడు వల్ల సునామీ వచ్చే అవకాశం ఉందని మాత్రం వారు సైతం ఊహించలేకపోయారు.

బారెన్ ఐలాండ్ అగ్నిపర్వతం వద్దకు వెళ్లొచ్చా?

వెళ్లొచ్చు.. పోర్ట్‌ బ్లెయిర్ నుంచి అద్దె పడవల్లో ఈ బారెన్ ఐలాండ్ అగ్నిపర్వతం వద్దకు వెళ్లొచ్చు. అయితే ఇందుకు.. తప్పనిసరిగా అటవీ శాఖ అధికారుల అనుమతి అవసరం. ఒకవేళ అనుమతి తీసుకుని అక్కడికి వెళ్లినా.. పర్యాటకులు తమ బోటులోంచి మాత్రమే ఆ అగ్నిపర్వతాన్ని చూడాలి తప్ప కిందికి దిగకూడదు.

తీరంలో బోటు దిగి లోనికి వెళ్లేందుకు అండమాన్ నికోబార్ పర్యాటక శాఖ ఏమాత్రం అనుమతించదు. కాబట్టి దూరం నుంచే కళ్లతో చూసి వచ్చేయాలి!

- Advertisement -