హిమాలయాల్లో ‘యతి’ అడుగు జాడలు! మంచు మనిషి నిజమేనంటూ ఇండియన్ ఆర్మీ ట్వీట్ …

3:54 pm, Tue, 30 April 19
Indian Army Latest Updates, Himalayas Latest News, Snow Man News, Newsxpressonline

కాశ్మీర్ : హిందూ పురాణాల ప్రకారం ఆంజనేయస్వామి చాలా ఎత్తు ఉంటారనీ, ఆయనంత హైటులో… ప్రత్యేక మానవులు (యతి) హిమాలయాల్లో ఉంటున్నారని కొన్నేళ్లుగా ప్రపంచ దేశాల్లో చర్చ జరుగుతోంది. తాము ‘యతి’ని చూశామని ఇదివరకు కొందరు అస్పష్టమైన ఫొటోలు కూడా విడుదల చేశారు.

అవన్నీ గ్రాఫిక్సేనని కొట్టిపారేశారు చాలామంది. అంతెందుకు హాలీవుడ్ మూవీ మమ్మీ సిరీస్‌లో వచ్చిన మూడో సినిమా ‘మమ్మీ: టూంబ్ ఆఫ్ ది డ్రాగన్ ఎంపరర్‌’లో చాలా యతిలను చూపించారు. అసలీ మిస్టీరియస్ జీవి ఉందా? లేదా? అన్న చర్చ అలా కొనసాగుతుండగా.. ‘యతి’ నిజమే అని నిరూపించే పాద ముద్రలను తాజాగా ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది.

‘యతి’ అడుగు జాడలు కనిపెట్టిన ఇండియన్ ఆర్మీ…

ఆ ఫుట్ ఫ్రింట్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసింది. అందువల్ల ఈ జీవి లేదు అని ఇన్నాళ్లూ చెప్పిన వాళ్లు ఇప్పుడు మళ్లీ ఆలోచనలో పడే పరిస్థితి. నిజంగా ఆ పాద ముద్రలు ‘యతి’వే అయితే… అసలు అంత పెద్ద జీవి ఉందా? ఉంటే, ఇన్నాళ్లూ అది ఎవరి కంటా పడకుండా ఎలా బతుకుతోంది? ఇంతకీ అది ఎక్కడ జీవిస్తోంది? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది.

ఇవన్నీ ఇలా ఉంటే ఇండియన్ ఆర్మీకి చెందిన పర్వతాల అధిరోహణ బృందం… పర్వతాలపై ప్రత్యేక పాద ముద్రల్ని చూసింది. అవి ఒక్కోటీ 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పూ ఉన్నాయి. ఈ లెక్కన ఆ జీవి దాదాపు 15 అడుగుల నుంచీ 30 అడుగుల ఎత్తు ఉండి ఉండాలి. ఏప్రిల్ 9న ఈ పాద ముద్రల్ని ఫొటోలు తీసినట్లు ఆర్మీ చెబుతోంది.