తమిళనాడులో మరో దారుణం.. పేలుడు పదార్థాలతో నక్కను చంపిన వైనం

- Advertisement -

చెన్నై: మొన్న కేరళలో ఏనుగు, నిన్న హిమాచల్ ప్రదేశ్‌లో ఆవు, నేడు తమిళనాడులో నక్క. ఇలా ప్రతి రోజూ ఓ మూగజీవాలను పొట్టనపెట్టుకుంటున్నారు దుర్మార్గులు.

కేరళలో గర్భంతో ఉన్న ఓ ఏనుగుకు అనాస కాయలో పేలుడు పదార్థాలు పెట్టి ప్రాణాలు తీశారు కొందరు దుండగులు. 

- Advertisement -

హిమాచల్ ప్రదేశ్‌లోనూ గర్భంతో ఉన్న ఓ ఆవుకు ఇదే తరహాలో ఆహారంలో పేలుడు పదార్థాలు పెట్టి తినిపించడంతో దాని నోరంతా ఛిద్రమైపోయి క్షోభ అనుభవిస్తోంది.

ఇక ఈ రోజు తమిళనాడులో ఓ నక్కను ఇలాగే హతమార్చారు కొందరు దుర్మార్గులు. 

తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఈ దారుణం చోటుచేసుకుంది. పేలుడు పదార్థాలను ఉపయోగించి నక్కను చంపిన 12 నరికురవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నరికురవర్ అనేది తమిళనాడులో ఓ తెగ. వీరి ప్రధాన వృత్తి వేట. మాంసంలో పేలుడు పదార్థాలు నింపిన వేటగాళ్లు నక్కకు ఎరవేశారు.

నక్క దానిని తిన్న వెంటనే ఒక్కసారిగా పేలిపోయింది. దాని దవడలు ఎగిరిపడ్డాయి. నక్క మాంసం, పళ్ల కోసమే దానిని వేటాడినట్టు తెలుస్తోంది.

ఈ విధంగా జంతువుల మాంసం, పళ్లు, పంజాల కోసం ఈ జాతివారు జంతువులను వేటాడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. 

ఓ టీ దుకాణం వద్ద అనుమానాస్పదంగా ఉన్న 12 మందిని చూసిన కానిస్టేబుల్ విజయరాఘవన్ ఆరా తీయగా అసలు విషయం వెలుగుచూసింది.

వారి సంచిలో నక్క కళేబరం కనిపించింది. దీంతో 12 మందినీ అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -