మోడీ నాయకత్వంలో పనిచేయడం నాకు గౌరవం: బీజేపీలోకి జయప్రద

4:50 pm, Tue, 26 March 19
BJP Latest News, Jayaprada Latest News, Narendra Modi Latest News, Newsxpressonline

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె బీజేపీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో పనిచేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.

తన జీవితంలో ఇదో కీలక ఘట్టమని జయప్రద వ్యాఖ్యానించారు. కాగా, జయప్రదను ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌ నుంచి బీజేపీ బరిలోకి దింపే అవకాశాలు కన్పిస్తున్నాయి. రామ్‌పూర్‌ నుంచి జయప్రద రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. దీంతో ఆమెను రామ్‌పూర్‌ బరిలో దింపితే గెలుపు ఖాయమని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

రసవత్తరపోరు…

అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ఆమె సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఆజంఖాన్‌తో తలపడనున్నారు. దీంతో ఈ పోటీ రసవత్తరంగా మారనుంది. కాగా, 1994లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేసిన జయప్రద ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీలోకి మారారు.

2004 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై రామ్‌పూర్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లోనూ మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆ తర్వాత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జయప్రదను 2010లో సమాజ్‌వాదీ పార్టీ బహిష్కరించింది.

గత సార్వత్రిక ఎన్నికల్లో ఆర్‌ఎల్‌డీ పార్టీ తరఫున బిజ్‌నోర్‌ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. సీనియర్ రాజకీయ నేత అమర్ సింగ్‌ను రాజకీయ గురువుగా భావించే జయప్రద బీజేపీలో చేరడం గమనార్హం.

చదవండిచంద్రబాబుతో నేనే మాట్లాడా ప్రయోజనం లేదు: మోహన్ బాబు