రిలయన్స్ జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 5 నెలలపాటు ఉచిత డేటా!

- Advertisement -

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో మరో భారీ ఆఫర్ ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్‌లో భాగంగా జియోఫై 4జీ వైర్‌లెస్ హాట్‌స్పాట్ కొనుగోలు చేసిన వారికి ఐదు నెలలపాటు ఉచిత డేటా, జియో నుంచి జియోకు ఉచిత కాల్స్ అందివ్వనున్నట్టు తెలిపింది.

జియోఫై ధర రూ. 1,999 మాత్రమే. ఈ ఆఫర్‌ను పొందేందుకు వినియోగదారులు తొలుత జియోపై కోసం ఇప్పటికే ఉన్న ప్లాన్లలో ఒకదానిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

- Advertisement -

రిలయన్స్ డిజిటల్ స్టోర్ నుంచి జియోఫైని కొనుగోలు చేసి జియో సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత అందుబాటులో ఉన్న మూడు ప్లాన్లలో ఒకదానిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

సిమ్ యాక్టివేట్ అయిన గంట తర్వాత ప్లాన్ అమల్లోకి వస్తుంది. మై జియో యాప్ ద్వారా యాక్టివేషన్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.

అందుబాటులో ఉన్న మూడు ప్లాన్లలో రూ.199 అత్యంత చవకైన ప్లాన్. ఇందులో రోజుకు 1.5జీబీ డేటా 28 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. ప్రైమ్ సభ్యత్వం కావాలంటే రూ. 99తో అదనంగా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

అలాగే, అదనంగా రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. జియో నుంచి జియోకు అపరిమిత ఉచిత కాల్స్, జియో నుంచి ఇతర నెట్‌వర్క్‌ల కోసం 1000 నిమిషాలు లభిస్తాయి. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు 140 రోజుల వరకు అందుబాటులో ఉంటాయి.

రూ. 249తో అందుబాటులో ఉన్న రెండో ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా 28 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. ప్రైమ్ సభ్యత్వం కోసం రూ. 99 చెల్లిస్తే అదనంగా రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. జియోకు అపరిమిత కాల్స్, ఇతర నెట్‌వర్క్‌లకు 1000 నిమిషాలు 28 రోజుల చెల్లుబాటుతో లభిస్తాయి. 100 ఎస్సెమ్మెస్‌లు 112 రోజుల వరకు లభిస్తాయి.

రూ. 349తో అందుబాటులో ఉన్న మూడో ప్లాన్‌లో 28 రోజులపాటు రోజుకు 3జీబీ డేటా లభిస్తుంది. రూ. 99 చెల్లిస్తే అదనంగా రోజుకు 3జీబీ డేటా లభిస్తుంది. మిగతా ప్రయోజనాలు పై ప్లాన్ల మాదిరిగానే లభిస్తాయి. 100 ఎస్సెమ్మెస్‌లు 84 రోజుల పాటు లభిస్తాయి.

- Advertisement -