భారత తొలి లోక్‌పాల్‌గా జస్టిస్ పీసీ ఘోస్ ప్రమాణ స్వీకారం

4:18 pm, Sat, 23 March 19
Justice Pinaki Ghose latest News, Ram nath Kovind News, India Latest News, Newsxpressonline

న్యూఢిల్లీ: భారత తొలి లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోస్ ప్రమాణస్వీకారం చేశారు. శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. జస్టిస్ పీసీ ఘోస్ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ హాజరయ్యారు.

లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ జస్టిస్ ఘోస్‌ను లోక్‌పాల్ చీఫ్‌గా ఎంపిక చేసింది. పారా మిలిటరీ దళమైన సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్‌బీ) మాజీ అధిపతి అర్చనా రామసుందరం, మహారాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ జైన్ తోపాటు మహేంద్ర సింగ్, ఇందరజీత్ ప్రసాద్ గౌతమ్ లను లోక్‌పాల్ నాన్ జ్యుడిషియల్ సభ్యులుగా ఎంపిక చేశారు.

కేంద్ర స్థాయిలో లోక్‌పాల్‌ను, రాష్ట్రస్థాయిలో లోకాయుక్త నియమాకానికి ఉద్దేశించిన లోక్‌పాల్, లోకాయుక్త చట్టం 2013లో ఆమోదం పొందింది. సిట్టింగ్ ఎంపీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులపై వచ్చే అవినీతి కేసులపై దర్యాప్తు చేసే అధికారం లోక్‌పాల్‌కు ఉంటుంది.