అశ్రునయనాల మధ్య ముగిసిన.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు

Former President of India Pranab Mukherjee Last Rites
- Advertisement -

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని లోధీ శ్మశానవాటికలో ముగిశాయి. 

అనారోగ్యంతో ఆగస్టు 10న ప్రణబ్ ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో అక్కడి వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స కూడా చేశారు. 

- Advertisement -

దీనికితోడు కరోనా బారిన పడిన ప్రణబ్ ఆసుపత్రిలో దాదాపు 21 రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. 

ప్రణబ్ భౌతిక కాయాన్ని 10, రాజాజీ మార్గ్‌లోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచి, మంగళవారం మధ్యాహ్నం ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ఆయన తనయుడు అభిజిత్ ముఖర్జీ తండ్రి అంత్యక్రియలను నిర్వహించారు. 

కోవిడ్ నిబంధనల నేపథ్యంలో గన్ క్యారేజ్‌‌పై కాకుండా సాధారణ అంబులెన్స్‌లో ప్రణబ్ ముఖర్జీ అంతిమ యాత్ర సాగింది. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలను నిర్వహించారు. 

ప్రణబ్ అంత్యక్రియల సమయంలో కరోనా ప్రోటోకాల్ ప్రకారం పరిమిత సంఖ్యలోనే సందర్శకులను అనుమతించారు.

అంతకు ముందు రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ శ్రద్ధాంజలి ఘటించారు. 

ఇంకా, కేంద్ర మంత్రి హర్షవర్ధన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింధియా, కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్, కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా తదితరులు, పలు పార్టీల నాయకులు, ఇతర ప్రముఖులు కూడా ప్రణబ్‌కు శ్రద్ధాంజలి ఘటించారు.

 

- Advertisement -