ఎన్డీఏదే మళ్లీ అధికారం: టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే ఫలితాలు ఇలా..

3:06 pm, Tue, 19 March 19
predicts Times Now VMR survey, Lok Sabha elections News, BJP Latest News, Newsxpressonline

న్యూఢిల్లీ: వచ్చే నెల(ఏప్రిల్)లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమే 283 స్థానాలతో మళ్లీ అధికారం చేపడుతుందని టైమ్స్ నౌ-వీఎంఆర్ ఓపీనియన్ సర్వే స్పష్టం చేసింది. ఇక యూపీఏకు గత ఎన్నికల్లో కంటే మెరుగ్గా 135 సీట్లు వచ్చే అవకాశం ఉందని తేల్చింది. ఇతరులు 125 స్థానాల్లో గెలుపొందే ఛాన్స్ ఉందని పేర్కొంది.

బీజేపీకి గణనీయంగా పెరిగిన ఓట్ షేర్..

దేశ వ్యాప్తంగా సుమారు 17వేల మందిని సర్వే చేయగా ఈ ఫలితాలు వెలువడ్డాయని సర్వే పేర్కొంది. ఈ సర్వే ప్రకారం 2014లో ఎన్డీఏకు 38.5శాతం ఓట్ షేర్ రాగా.. 2019లో అనూహ్యంగా 40.1శాతం ఓట్ షేర్ నమోదవనుందని తేలింది. ఎన్డీఏకు తొలిసారిగా 40శాతం కంటే ఎక్కువ ఓట్ షేర్ రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

కాగా, యూపీఏకు 2014లో 23శాతం ఓట్ షేర్ రాగా.. 2019లో 30.6శాతం లభించనుంది. దీంతో కాంగ్రెస్ కూడా గతం కంటే ఎక్కువ ఓట్ షేర్ నమోదు చేస్తుందని తెలుస్తోంది. ఉత్తరభారతదేశం, ఈశాన్య రాష్ట్రాలతోపాటు పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో కూడా బీజేపీకి భారీ విజయాలు లభిస్తాయని టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే అంచనా వేసింది.

దక్షిణాది రాష్ట్రాల్లోనూ బీజేపీ మెరుగైన ఫలితాలను సాధిస్తుందని సర్వే తేల్చింది. కర్ణాటకలో బీజేపీకి 15, కాంగ్రెస్-జేడీఎస్ కు కలిపి 13 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల హవా కొనసాగుతుంది. 

25స్థానాలు గల ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీకి 22 సీట్లు, టీడీపీకి 3 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే తేల్చింది. ఇక తెలంగాణలోని 17 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీకి 13స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. బీజేపీకి 2 స్థానాలు, ఇతరులకు 2 స్థానం వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.