చైనా కంపెనీలకు షాక్ ఇచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం.. రూ.5 వేల కోట్ల ఒప్పందాలు నిలిపివేత

- Advertisement -

ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం చైనా కంపెనీలకు షాక్ ఇచ్చింది. దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన ఒప్పందాలను నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. 

ఆ మధ్య పెట్టుబడుల సదస్సు ‘మ్యాగ్నటిక్ మహారాష్ట్ర 2.0’లో భాగంగా చైనాకు చెందిన సంస్థలతో మహారాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంది.

- Advertisement -
చదవండి: చైనాతో రెండు యుద్ధాలు.. మన సైనికులు తగ్గలేదు, మనమూ తగ్గొద్దు: కేజ్రీవాల్

అయితే దేశ సరిహద్దుల్లో చైనా ఆగడాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్ పేర్కొన్నారు. 

వీటిలో ఆటోమొబైల్ ప్లాంటు ఏర్పాటుకు గ్రేట్ వాల్ మోటార్స్ రూ.3,770 కోట్ల ఒప్పందం, పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటీ రూ.1,000 కోట్ల ఒప్పందం, హెంగ్లీ ఇంజనీరింగ్ రూ.250 కోట్ల ఒప్పందం ఉన్నాయి. 

‘‘కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపుల తర్వాతే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టులు నిలిచిపోయినట్లే. కేంద్రం నుంచి తదుపరి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం..’’ అని పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్ వ్యాఖ్యానించారు. 

లఢక్‌లోని గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో భారత సైనికులు 20 మంది వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.

చదవండి: కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రూ. 5 కోట్ల చెక్కులను అందించిన కేసీఆర్

ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా చైనా వస్తువులను బహిష్కరించాలనే నినాదం ఊపందుకుంటోంది. పలు వాణిజ్య సంఘాలు, వ్యాపారులు చైనా ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

ఇప్పటికే భారతీయ రైల్వేకు చెందిన డీఎఫ్‌సీసీఐఎల్ సంస్థ చైనాకు చెందిన కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. 

దేశ ప్రజానీకం స్వచ్ఛందంగా చైనా వస్తువులను బహిష్కరించాలని పలువురు కేంద్ర మంత్రులు కూడా పిలుపునిచ్చారు. 

 

- Advertisement -