ఆదాయం లేదట! ప్రజాప్రతినిధుల వేతనాల్లో 60 శాతం కట్ : షాకిచ్చిన మహా సర్కారు

3:42 pm, Tue, 31 March 20

ముంబై: ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు మహారాష్ట్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. కరోనా వైరస్ భయాందోళన నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది.

ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరానికి రాబడి గణనీయంగా పడిపోయే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాల్లో భారీ కోతకు సిద్ధమైంది.

ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నుంచి గ్రామ పంచాయతీ సభ్యుల వరకు అందరికీ వేతనాల్లో 60 శాతం కోత విధిస్తున్నట్టు ప్రభుత్వం ఈ రోజు (మంగళవారం) ప్రకటించింది.

అంటే మార్చినెల వేతనంలో 40 శాతం మాత్రమే వారికి అందుతుంది. క్లాస్ ఎ, క్లాస్ బి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి అజిత్ పవార్ తెలిపారు.

ప్రభుత్వం ఉద్యోగుల యూనియన్లతో జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల కోవిడ్‌పై పోరుకు ప్రభుత్వానికి ఆర్థికంగా మరింత వెసులుబాటు లభిస్తుందని పేర్కొన్నారు.

అయితే, క్లాస్-సి లోని క్లరికల్ ఉద్యోగులు మాత్రం తమ వేతనంలో 75 శాతం పొందుతారని ప్రభుత్వం పేర్కొంది.

క్లాస్- డి ఉద్యోగులైన ప్యూన్లు, ఆఫీసు అసిస్టెంట్ల వేతనాల్లో మాత్రం ఎటువంటి కోత ఉండని స్పష్టం చేసింది.

ఈ విపత్కర సమయంలో వీరంతా ప్రభుత్వానికి సహకరిస్తారని ఆశిస్తున్నట్టు అజిత్ పవార్ చెప్పారు.