దమ్ముంటే ఒక్క ఎమ్మెల్యేనైనా తీసుకెళ్లు: మోడీకి మమత సవాల్…   

9:42 am, Wed, 1 May 19
mamata-banerjee-challenge-to-pm-modi

కోల్‌కతా: ప్రధాని మోడీ.. పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీల మధ్య సవాళ్ళ పర్వం నడుస్తోంది. తాజాగా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.

ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని, మమతాని వదిలిపెట్టడం ఖాయమని మోడీ కామెంట్ చేశారు. అంతేకాదు, ఇప్పటికే 40 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

‘‘రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉండి ఇలానా…?’’

ఈ నేపథ్యంలో.. మోడీ వ్యాఖ్యలపై మమత ఫైర్ అయ్యారు. బీజేపీలా తమకు ఎమ్మెల్యేలను ఎత్తుకెళ్లే సంప్రదాయం లేదని, రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉండి ఇటువంటి మాటలు మాట్లాడడానికి సిగ్గు లేదా? అంటూ ప్రధానిపై తీవ్రంగా మండిపడ్డారు.  దమ్ముంటే ఒక్క ఎమ్మెల్యేనైనా తీసుకెళ్లాలంటూ మోడీకి సవాలు విసిరారు. 

అంతేకాదు, ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగుతున్న మోడీ లోక్‌సభ నామినేషన్‌ను వెంటనే రద్దు చేయాలని కూడా మమత డిమాండ్ చేశారు. ఇప్పటికే దీనిపై ఈసీకి తమ పార్టీ ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. మోడీ వ్యాఖ్యలు రాజ్యాంగానికి పూర్తి విరుద్ధమని, ఆయన ప్రధానిగా ఉండే హక్కు కోల్పోయారని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

చదవండి: హిమాలయాల్లో ‘యతి’ అడుగు జాడలు! మంచు మనిషి నిజమేనంటూ ఇండియన్ ఆర్మీ ట్వీట్ …