‘‘అభినందన్’ అర్థం మారిపోయింది.. భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది..’’

5:15 pm, Sat, 2 March 19
modi-abhinandan

న్యూఢిల్లీ: పాకిస్థాన్ నిర్బంధంలో మూడు రోజులపాటు ఉండి శుక్రవారం సొంత గడ్డపై అడుగుపెట్టిన భారత వైమానికదళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌పై ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన చూపిన ధైర్యసాహసాలు, దృఢ సంకల్పం దేశ ప్రజలందరికీ ఆదర్శనీయమని కొనియాడారు.

అంతేగాక, ‘అభినందన్’‌ అనే పదానికి ఇప్పుడు ఆ అర్థం మారిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ గురించి ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్‌ ఏం చేస్తుందో ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయని ప్రధాని మోడీ అన్నారు. డిక్షనరీలో ఉన్న అర్థాలకు భారత్‌ సరికొత్త అర్థాన్ని తీసుకురాగలదనే శక్తి ప్రపంచదేశాలు గుర్తించాయని మోడీ అన్నారు.

భారత్ శక్తి ఎంటో ప్రపంచానికి తెలిసింది…

‘భారత్‌ ఏం చేస్తుందో ప్రపంచం గమనిస్తోంది. డిక్షనరీలో ఉన్న పదాలకు అర్థాలను మార్చగలిగే శక్తి మన దేశానికి ఉంది. కంగ్రాట్స్‌ చెప్పే క్రమంలో అభినందన్‌ పదాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు అభినందన్‌ అర్థమే మారిపోయింది’ అని మోడీ వ్యాఖ్యానించారు.

భారత గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించిన పాక్ యుద్ధ విమానాలను తరుముతూ వెళ్లిన భారత యుద్ధ విమానం పాక్ భూభాగంలో కూలిపోయింది. అందులోని అభినందన్ సురక్షితంగా నేలపైకి దిగాడు. గమనించిన కొందరు స్థానికులు ఆయనపై దాడి చేశారు.

వెంటనే అక్కడికి చేరుకున్న పాక్ సైనికులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజులపాటు నిర్బంధంలో ఉన్న వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పాక్‌ నుంచి శుక్రవారం రాత్రి సురక్షితంగా భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.

చదవండి: సెల్యూట్: అభినందన్‌పై ప్రశంసల వర్షం కురిపించిన ప్రధాని మోడీ, ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు