కుప్పకూలిన మిగ్-27.. పైలెట్ సురక్షితం! ఈ వరుస ప్రమాదాలేమిటో?

3:24 pm, Sun, 31 March 19
mig-27-fighter-jet-crash-in-jodhpur

జైపూర్: భారత వాయుసేనకు చెందిన మిగ్-27 యుద్ధ విమానం కుప్పకూలింది. ఆదివారం ఉదయం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి బయలుదేరిన ఈ విమానం కొద్దిసేపటికే కూలిపోయినట్లు ఐఏఎఫ్ అధికారులు తెలిపారు. జోధ్‌పూర్‌కు 120 కిలోమీటర్ల దూరంలోని సిరోహి ప్రాంతంలో ఈ యుద్ధ విమానం కూలిపోయిందని, అయితే పైలట్ సురక్షితంగా బయటపడ్డాడని వారు పేర్కొన్నారు.

ఇటీవల భారత వాయుసేనకు చెందిన మిగ్ యుద్ధ విమానాలు కూలిపోతున్న ఘటనలు అధికమవుతున్నాయి. మూడు వారాల క్రితం కూడా రాజస్థాన్‌లోని బికనీర్ ప్రాంతంలోనూ ఓ మిగ్-21 యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి ఆ విమానాన్ని నడిపిన పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.

వరుస ప్రమాదాలు.. ఎందుకని?

అలాగే పాకిస్తాన్ బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన జరిపిన ఎయిర్ స్ట్రయిక్ అనంతరం.. గత ఫిబ్రవరి 27న పాక్ యుద్ధ విమానాలు చొరబడేందుకు యత్నించగా, వాటిని తిప్పికొట్టే క్రమంలో ఓ మిగ్-21 యుద్ధ విమానం పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంలో నేలకూలింది.

ఈ ఘటనలోనే ఆ విమానాన్ని నడిపిన పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ పాక్ సైనికులకు చిక్కి.. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో క్షేమంగా భారత్ చేరుకున్నారు. ఇప్పుడు మళ్లీ మరో మిగ్-27 విమానం రాజస్థాన్‌లో కూలిపోయింది. ఇలా మిగ్ యుద్ధ విమానాలు వరుసగా కూలిపోతుండడంపై ఐఏఎఫ్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

తాజాగా జరిగిన ప్రమాదంలో.. మిగ్-27 యుద్ధ విమానం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలపై భారత వాయుసేన అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని వారు నియమించి దర్యాప్తునకు ఆదేశించారు.