కనిపించిన నెలవంక! ‘పవిత్ర రంజాన్ మాసం’ ప్రారంభం!

-ramadan
- Advertisement -

హైదరాబాద్: ముస్లీం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమైంది. ఆదివారం ఆకాశంలో నెలవంక కనపించడంతో సోమవారం తెల్లవారుజామునుంచే ఉపవాస దీక్షలు ప్రారంభించారు. రంజాన్ నెల ఆరంభం నుంచి ముస్లీం సోదరులంతా 30 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు.

వేకువ జామునే నాలుగు గంటలకు ఆహారం తీసుకుంటారు. దీన్నే ‘సహర్’ అంటారు. ఆతర్వాత సూర్యాస్తమయం అయ్యే వరకు పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోరు. సాయంత్రం ఉపవాసాన్ని విరమించడాన్ని ‘ఇఫ్తార్’ అంటారు. ఈ నెలలో ముస్లింలు జకాత్ రూపంలో పేదలకు తమ ధనంలో రెండున్నర శాతం సొమ్మును దానం చేస్తారు. ముస్లింలు చేసే ప్రార్థన (నమాజ్) మానసిక పరివర్తన తెస్తుంది.

నిర్మల మనసుతో పాటు మానసిక, శారీరక ప్రశాంతత నేర్పుతుంది. అలాంటి నమాజ్ ఈ మాసంలో రోజూ 5 పూటలు చేస్తారు. ఇందులో భాగంగా రాత్రివేళ చేసే ఇషా నమాజ్ తరువాత 30 రోజుల పాటు రంజాన్ మాసంలో ప్రత్యేక తరావీ నమాజ్‌ కూడా చేస్తారు.

ప్రభుత్వం మినహాయింపులు…

తెలంగాణలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ఉద్యోగులకు మినహాయింపులు ఇచ్చింది. సాయంత్రం 4 గంటలకే కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే వెసులుబాటు కలిపించింది.

మరోవైపు ప్రధాని మోదీ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసం సమాజంలో సంతోషాన్ని, సోదర భావాన్ని, సామరస్యాన్ని పెంపొందించాలని ప్రధాని ఆకాంక్షించారు

- Advertisement -