న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో రుణాలపై ఆర్బీఐ విధించిన మారటోరియం రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు మంగళవారం తెలియజేసింది.
మారటోరియం వల్ల రుణ చెల్లింపు కాలపరిమితి మాత్రమే పెరుగుతుందని, ఆ కాలానికి వడ్డీ మాత్రం చెల్లించాల్సిందేనంటూ ఆర్బీఐ గతంలోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
అయితే వడ్డీని మాఫీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలంటూ పలువురు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది.
మారటోరియం, వడ్డీ చెల్లింపు తదితరాలపై కేంద్రం వైఖరి ఏమిటో తెలియజేయాలంటూ సుప్రీంకోర్టు ఆగస్టు 26నే ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం పిటిషన్ విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరపున వాదనలు వినిపించారు.
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తీసుకున్న చర్యల వల్ల దేశ వృద్ధి రేటు 23 శాతం పడిపోయిందని కేంద్రం తెలిపింది. ఆర్థిక సమస్యల పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
ఈ నేపథ్యంలో మారటోరియం కాలంలో వడ్డీని పరిగణనలోనికి తీసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొనడంతో స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం న్యాయంగా ఆలోచించాలంటూ కేంద్రానికి హితవు పలికింది.
అంతేకాకుండా ఈ విషయంలో జాప్యం చేయదలచుకోలేదని, దీనిపై రేపు పూర్తిస్థాయిలో వాదనలు వింటామంటూ జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది.