దేశంలోని కోవిడ్ మృతుల్లో 30 ఏళ్ల లోపు వారు 103 మంది!

10:06 pm, Thu, 21 May 20
80-people-infected-with-covid19-from-a-single-woman-in-hyderabad

న్యూఢిల్లీ: వృద్ధులు, అనారోగ్య పీడితులకే కరోనా ముప్పు అధికమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నా.. దేశంలో సంభవిస్తున్న మరణాల్లో యువకులు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

గురువారం కేంద్రం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. దేశంలోని కరోనా మృతుల్లో 103 మంది 30 ఏళ్ల లోపు వారే.

వీరిలో 17 మంది చిన్నారులు ఉండగా, వారి వయసు 15 ఏళ్ల లోపే కావడం గమనార్హం. అంటువ్యాధి బారినపడిన వీరంతా కాలేయం, కిడ్నీలు, గుండె దెబ్బతినడం కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

గురువారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 3,435 మంది మరణించారు. వీరిలో 50.5 శాతం మంది 60 ఏళ్లు పైబడినవారే.

కరోనా మరణాల రేటు దేశంలో 3 శాతానికి కొద్దిగా ఎక్కువగా ఉండగా, ప్రపంచ వ్యాప్తంగా సగటున 6.65 శాతం గా ఉంది.

దేశంలో 60 ఏళ్లు పైబడిన దాదాపు 1700 మంది కరోనా కాటుకు బలయ్యారు. అలాగే, 15-30 ఏళ్ల మధ్యనున్న వారు 85 మంది, 30-45 ఏళ్ల మధ్యనున్న వారు 392 మంది, 45-60 ఏళ్ల మధ్యనున్న వారు 1205 మంది, 60 ఏళ్లకు పైబడిన వారు 1734 మంది మరణించినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.

కాగా, మరణించిన వారిలో 2,500 మందికి పైగా మధుమేహం, రక్తపోటు, శ్వాసకోశ, కిడ్నీ, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక, చనిపోయిన వారిలో 2,198 మంది పురుషులే కావడం గమనార్హం.