యూటర్న్ బాబుకు పోలవరం ఏటీఎంలా: భళ్లాల దేవుడంటూ ఏకిపారేసిన మోడీ

5:52 pm, Mon, 1 April 19
Chandrababu naidu Latest News, Modi Latest news Polavaram Praject Latest news, Newsxpressonline

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. గడిచిన ఐదేళ్లలో ఏమాత్రం పన్నులు పెంచలేదని, కోట్లాది మంది చెల్లిస్తున్న పన్నుల వల్లే విద్య, మౌళిక సదుపాయాల్లో అభివృద్ధి సాధ్యమవుతోందని ప్రధాని చెప్పారు. రూ. 5లక్షల వరకు ఎలాంటి పన్ను లేకుండా చారిత్రక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

కాకినాడను స్మార్ట్‌సిటీగా చేయడమే కాకుండా, గ్రీన్‌ఫీల్డ్‌ పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ తదితర ప్రాజెక్టులు తీసుకొచ్చామన్నారు. పన్ను పరిధిని పెంచాలంటూ ఎన్నో ఏళ్లుగా ప్రజలకు కోరుతున్నప్పటికీ గత ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోలేదని.. మేం దానిపై కీలక నిర్ణయం తీసుకున్నామని ప్రధాని వివరించారు.

యూటర్న్ బాబుకు ఏటీఎంలా పోలవరం..

రాజమహేంద్రవరంలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోడీ ప్రసంగిస్తూ ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. యు-టర్న్ బాబుకు పోలవరం ప్రాజెక్టు ఓ ఏటీఎంలా మారిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు.

చంద్రబాబు పాలన అధర్మం, అన్యాయంగా మారిందని, మరోసారి అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. బాబు మాటలను ఏపీ ప్రజలు ఎప్పటికీ నమ్మరని విమర్శించారు. సీఎం చంద్రబాబు స్టిక్కర్‌ బాబుగా మారారని ప్రధాని దుయ్యబట్టారు. ప్రతి కేంద్ర పథకంపైనా చంద్రబాబు స్టిక్కర్‌ తగిలిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్‌ యోజనపైనా స్టిక్కర్‌ పెట్టారన్నారు.

బాహుబలి సినిమాలో భళ్లాల దేవుడిలా..

చంద్రబాబు పరిస్థితి ‘బాహుబలి’ సినిమాలో భళ్లాలదేవుడిలా మారిందని తీవ్రస్థాయిలో విమర్శించారు ప్రధాని. చంద్రబాబు మాటలను ఆంధ్రా ప్రజలు ఎప్పటికీ నమ్మరన్నారు. ఇక్కడి ప్రజలు నీతిగా జీవిస్తారని.. చంద్రబాబు మాత్రం వారిని మోసం చేస్తుంటారని దుయ్యబట్టారు. సేవా మిత్ర యాప్‌ ద్వారా ప్రజలకు టీడీపీ సేవ చేయడం లేదని ఆరోపించారు.

‘సేవ లేదు.. మిత్రులు కాదు.. ప్రజల వివరాలు దొంగిలించారు’ అని ప్రధాని ధ్వజమెత్తారు. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌లకు ప్రజల సంక్షేమం పట్టదన్నారు. వాళ్ల కుటుంబాల వికాసం కోసమే ఆ పార్టీలు పనిచేస్తుంటాయన్నారు. ఉగ్రవాదులను వాళ్ల గడ్డపైకి వెళ్లి మరీ దాడి చేశామని.. కొందరు నేతలు మాత్రం పొరుగు దేశానికి మద్దతు పలుకుతున్నారని చంద్రబాబుతోపాటు ఇతర పార్టీల నేతలనుద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు.

హెరిటేజ్ కాపాడుకోవడం కోసం..

ఏపీ హెరిటేజ్‌ను కాపాడటం తమ పని అని, అయితే, తన ‘హెరిటేజ్’ ను కాపాడుకోవడం ఏపీ సీఎం చంద్రబాబు పని అంటూ ప్రధాని మోడీ విమర్శించారు. యుటర్న్ బాబు తన హెరిటేజ్ సంస్థ కోసమే పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదని విమర్శించారు.

చదవండి: నీరవ్ మోడీకి ఈడీ షాక్: ఆన్‌లైన్‌లో 13 లగ్జరీ కార్ల వేలం, ఎప్పుడో తెలుసా?