ఉగ్ర స్థావరాలపై భారత్ వైమానిక దాడులు: మోడీ అత్యవసర కేబినెట్ సమావేశం…

12:15 pm, Tue, 26 February 19
narendra modi

న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దళం చేపట్టిన మెరుపుదాడుల అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ భేటీ అయ్యింది.

నియంత్రణ రేఖకు అవతల పాక్ భూభాగంలో ఉన్న ఉగ్ర స్థావరాలపై భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో బాంబులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పాక్ సైన్యం, ఉగ్రవాదులు ఏం జరుగుతోందో గుర్తించేలోగానే భారత్ తన పని పూర్తిచేసుకొచ్చింది. 12 మిరేజ్-2000 ఫైటర్ జెట్స్ ద్వారా 1000 కేజీల బాంబులతో ఎల్వోసీకి అవతల విధ్వంసం సృష్టించింది.

ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ప్రధాని మోడీ నివాసంలో జరుగుతున్న ఈ భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ భేటీకి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ హాజరయ్యారు.

జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరై ప్రస్తుత పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అజిత్ దోవల్ మెరుపుదాడిపై ప్రధానికి వివరించారు. ఈ మెరుపు దాడి తర్వాత తీసుకునే చర్యలపైనా చర్చిస్తున్నారు.

దాయాది దేశంలోనూ అత్యవసర భేటీ…

ఇది ఇలా ఉండగా, భారత వైమానిక దాడులపై పాకిస్థాన్‌ కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్‌లో అత్యవసర భేటీని పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ నిర్వహిస్తున్నారు. తాజా సరిహద్దు పరిస్థులు, దేశ భద్రతపై చర్చలు జరిపేందుకు వీరు భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది.

చదవండి: భారత్ మెరుపు దాడులు: పాక్ ఉగ్ర స్థావరాలు సర్వనాశనం